కరోనా రైలు ప్రయాణం

ABN , First Publish Date - 2020-05-13T07:47:56+05:30 IST

అది వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చే ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైలు. మహారాష్ట్రలోని థానే నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెంది న 930మంది వలస కార్మికులు ఆ రైల్లో ఏపీలోని అనంతపురం జిల్లా...

కరోనా రైలు ప్రయాణం

  • వైరస్‌ వాహకాలుగా రైళ్లు! 
  • మహారాష్ట్ర నుంచి గుంతకల్లుకు 930 మంది 
  • వారిలో 38 మందికి కరోనా పాజిటివ్‌ 

న్యూఢిల్లీ/అమరావతి,మే12(ఆంధ్రజ్యోతి): అది వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చే ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైలు. మహారాష్ట్రలోని థానే నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెంది న 930మంది వలస కార్మికులు ఆ రైల్లో ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో దిగారు. వీరందరికీ థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేశారు. అనుమానితులైన 250 మందికి పరీక్షలు నిర్వహించగా 38మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దేశవ్యాప్తంగా వలస కూలీల తరలింపునకు పెద్ద ఎత్తున ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లు తిరుగుతుండటం, మంగళవారం నుంచి ప్రయాణికుల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేకరైళ్లను అనుమతించిన నేపథ్యంలో ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం నాటికి ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్ల ద్వారా 6.48 లక్షల మంది వలస కూలీలు, కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నారు. ప్రత్యేక రైళ్లకు అనుమతించిన ఒక్కరోజులోనే 45,533 బుకింగ్‌లు(పీఎన్‌ఆర్స్‌) నమోదయ్యాయి. ఈ బుకింగ్‌ల ద్వారా 80,317 మంది ప్రయాణికులు రైళ్లలో గమ్యస్థానాలకు వెళ్లనున్నారు. దేశంలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్న తరుణంలో రైళ్ల ద్వారా లక్షల సంఖ్యలో జనం తరలుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రైళ్లు కరోనా వాహకాలుగా మారాయన్న భయం ప్రజల్లో నెలకొంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే రోజూ 3000-3500 కేసులు వెలుగుచూస్తున్నాయని, రైళ్ల వల్ల పరిస్థితి ఏ స్థాయికి చేరుకుంటుందో అనే భయం వ్యక్తమవుతోంది. కాగా, 50 రోజుల తర్వాత మంగళవారం తొలిరైలు సాయంత్రం 4గంటలకు కూత పెట్టింది. ఈ రైలు 1177 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి ఛత్తీ్‌సగఢ్‌లోని బిలా్‌సపూర్‌కు బయల్దేరింది. మొత్తంగా 8 ప్రత్యేక ఏసీ రైళ్లు నడిచాయి. 3 రైళ్లు ఢిల్లీ నుంచి ఇతర స్టేషన్లకు నడవగా, మిగతా 5 ఇతర నగరాల నుంచి ఢిల్లీకి నడిచాయి. 20వ తేదీ దాకా 15 ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రభు త్వం నిర్ణయించింది.


17న సికింద్రాబాద్‌కు ఢిల్లీ నుంచి ప్రత్యేక రైలును పునరుద్ధరిస్తారు. అదే రైలు 20న సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరుతుంది. అయితే మంగళవారం బయల్దేరిన ఢిల్లీ-బెంగళూరు రైలు బుధవారం సికింద్రాబాద్‌ స్టేషన్‌ లో ఆగనుంది. ప్రత్యేక రైళ్ల కోసం ప్ర యాణికుల బుకింగ్‌లు జోరందుకున్నా యి. సోమవారం సాయంత్రం 6గంటలకు టికెట్ల బుకింగ్‌ మొదలవ్వగా ఒక్కరోజే రైల్వే శాఖకు రూ.16.15 కోట్ల ఆదాయం సమకూరింది. మంగళవారం నాటికి ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్ల ద్వారా 6.48 లక్షల మంది వలస కూలీలు, కార్మికులు,  పర్యాటకులు, విద్యార్థులు ప్రయాణించారు. ‘వందే భారత్‌ మిషన్‌’ కింద తొలి 5 రోజుల్లో 31 ఎయిర్‌ ఇండియా విమానాల్లో 6037 మంది విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చారు. మే 7 నుంచి 14వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 12 దేశాల్లో చిక్కుకుపోయిన దాదాపు 15వేల మందిని 64 విమానాల ద్వారా తరలిస్తారని అంచనా. 


బిహార్‌కు 1,200 మంది వలస కూలీలు

ఘట్‌కేసర్‌: ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైలు సోమవారం రాత్రి ఘట్‌కేసర్‌ స్టేషన్‌ నుంచి బిహార్‌కు బయల్దే రింది. ఇందులో 1,200 మంది వలస కూలీలు స్వరాష్ట్రానికి పయనమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో కూలీలను రైల్వేస్టేషన్‌కు తరలించారు. కార్మికులను, భోజన పొట్లాలను, నీళ్ల బాటిళ్లను అందజేశారు. మంగళవారం రాత్రి మరో రైల్లో వలస కూలీలను బిహార్‌కు తరలిస్తారు.



సేతు యాప్‌ ఉంటేనే రైలెక్కాలి 

ప్రత్యేక రైళ్లను వేసే క్రమంలో రైల్వేశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసుకున్న వారినే ప్రయాణానికి అనుమతిస్తారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ కోసం గంటన్నర ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. మాస్కులు తప్పనిసరి. ప్రయాణికులు తమ ఆహారం, తాగేనీరును వెంట తెచ్చుకోవాలి. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రయాణికులు డౌన్‌లోడ్‌ చేసుకుంటే మంచిదని సోమవారం సలహా ఇచ్చిన రైల్వేశాఖ, మంగళవారం ఇది తప్పనిసరి అని ప్రకటించిది. రైలెక్కే ప్రతీ ప్రయాణికుడు తమ మొబైల్లో ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాతే స్టేషన్‌కు రావాలని పేర్కొంది. ప్రయాణికుల వద్ద స్మార్ట్‌ఫోన్‌ లేనట్లయితే మినహాయింపు విషయంలో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. 


Updated Date - 2020-05-13T07:47:56+05:30 IST