అష్టాదశ శక్తి పీఠాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ ఫోకస్
ABN , First Publish Date - 2020-10-25T03:07:35+05:30 IST
శక్తి పీఠాలు.. హిందూ పురాణాల ప్రకారం అత్యంత మహిమాన్విత ప్రదేశాలు. దేశమంతటా వివిధ ప్రదేశాల్లో శక్తిపీఠాలు కొలువై ఉన్నాయి. భారతదేశంలోనే కాదు.. ప్రస్తుత పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఒక శక్తిపీఠం..

భారతదేశంలో సనాతన సంస్కృతిని ఆచరించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. పురాణాలపై విశ్వాసం, ఆధ్యాత్మిక వైభవం ఈ స్థాయిలో మరే దేశంలో కనిపించదు. అలా.. పురాణేతి హాసాల ఆధారంగా పూజించబడుతున్నవి శక్తిపీఠాలు. అమ్మవారు శక్తి రూపంలో దర్శనమిస్తున్న అష్టాదశ శక్తిపీఠాలపై ఏబీఎన్ స్పెషల్ ఫోకస్.
శక్తి పీఠాలు.. హిందూ పురాణాల ప్రకారం అత్యంత మహిమాన్విత ప్రదేశాలు. దేశమంతటా వివిధ ప్రదేశాల్లో శక్తిపీఠాలు కొలువై ఉన్నాయి. భారతదేశంలోనే కాదు.. ప్రస్తుత పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఒక శక్తిపీఠం, శ్రీలంకలో మరో శక్తిపీఠం ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. శక్తిపీఠాల్లో పలు అవతారాల్లో, ఆయా పేర్లతో శక్తి స్వరూపిణిగా పార్వతీమాత కొలువై ఉంది. అక్కడి క్షేత్ర ప్రాముఖ్యతలు, విశ్వాసాలను బట్టి పూజలందుకుంటోంది. ఒక్కో క్షేత్రంలో ఒక్కో పేరుతో ప్రతిష్టంచబడింది.
అలాంటి మహిమాన్విత ప్రదేశాల్లో నాలుగు శక్తి పీఠాలు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం విశేషం. అందులోనూ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే మూడు శక్తి పీఠాలు ఉన్నాయి. తెలంగాణలో ఒక శక్తిపీఠం ఉంది. ఆయా క్షేత్రాలకు ప్రత్యేకంగా వేర్వేరు చరిత్రలు చెప్పుకున్నా, ఆ క్షేత్రాల్లో కొలువైన అమ్మవారి ఆలయాలకు సంబంధించిన చరిత్ర మాత్రం ఒక్కటే. సతీదేవి శరీర భాగాలు పడిన చోట శక్తిపీఠాలు ఆవిర్భవించాయి. అలా.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు పుణ్య స్థలాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి.
అయితే, ఈ శక్తిపీఠాల విషయంలో స్పష్టత లేదు. సంఖ్య విషయంలో సందిగ్ధం ఉంది. కొందరు 18 శక్తిపీఠాలు అని చెబితే, మరికొందరు 51అనీ, ఇంకొందరు 52 అనీ చెబుతారు. మొత్తం 108 శక్తి పీఠాలు ఉన్నాయన్న నానుడి కూడా ఉంది. అయితే, వీటన్నింటిలో 18 శక్తిపీఠాలు ప్రధానమైనవి. వాటిని అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు.
శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయన్న విషయంలో పురాణ గాథ ఉంది. వాటికి అంత శక్తి ఎలా చేకూరిందన్న విషయం కూడా ఆ గాథలో చెబుతారు. దక్షుడు బృహస్పతి యాగం చేసిన సమయంలో అందరినీ ఆహ్వానించి తన కుమార్తె సతీదేవికి సమాచారం ఇవ్వలేదు. తన మాట వినకుండా కూతురు పరమ శివుడిని వివాహమాడిందన్న కోపమే అందుకు కారణం. కానీ, సతీదేవి మాత్రం తండ్రి పిలవకున్నా ప్రమధ గణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్లింది. అయితే, అక్కడ తాను అవమానానికి గురయ్యింది. అంతేకాకుండా శివనిందను జీర్ణించుకోలేక అదే యోగాగ్నిలో భస్మమయ్యింది. దీంతో, శివుడు ఆగ్రహించి యాగశాలను ధ్వంసం చేశాడు.
అంతేకాకుండా.. పరమశివుడు సతీదేవి సూక్ష్మదేహాన్ని భుజంపై వేసుకుని, విలయతాండవం చేశాడు. ఆ సమయంలో శివుని ఆవేశాన్ని తగ్గించి, ఆయనను ఆ నిర్వేదం నుండి దూరం చేసేందుకు శ్రీ మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగాలను ఖండించాడు. అలా సతీదేవి శరీర భాగాలు 18 ప్రేదశాల్లో పడటంతో ఆ స్థలాలు శక్తి పీఠాలుగా వెలిశాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రధానంగా తంత్ర సాధకులకు శక్తిపీఠాలు ఆరాధనా స్థలాలయ్యాయి. ప్రతి శక్తిపీఠంలోనూ సతీదేవి.. శివుడి తోడుగా భక్తులకు దర్శనమిస్తుంది.
అలా అష్టాదశ శక్తి పీఠాల గురించి పురాణాల్లో ఉంది. అమ్మవారి ఒక్కో శరీరభాగం ఒక్కో ప్రదేశంలో పడిందని, ఆ ప్రదేశాలు శక్తిపీఠాలయ్యాయని ప్రతీతి. ఒక్కో శక్తిపీఠంలోని అమ్మవారిని ఒక్కో పేరుతో పిలుస్తారు. అలా ఏర్పడ్డ 18 శక్తి పీఠాలకు ఓ వరుసక్రమం ఉంది. వాటి గురించి వివరంగా చూస్తే.. శ్రీలంకలో అమ్మవారిని శాంకరిగా పిలుస్తారని పురాణాల్లో రాశారు. అయితే, ఆ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు . శ్రీలంక తూర్పుతీరంలోని ట్రిన్‌కోమలీలో ఉండవచ్చని, 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి దాడుల్లో ఆ మందిరం నాశనమైందని చెబుతారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉంది. ఆ స్తంభమే ఆ క్షేత్రానికి రుజువుగా పేర్కొంటారు.
చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురంలో అమ్మవారిని కామాక్షి దేవిగా కొలుస్తారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్రద్యుమ్న నగరంలో శృంఖలా దేవి కూడా ఒక శక్తిపీఠంగా చెబుతారు. ఈ క్షేత్రం కోల్‌కతాకు 80 కిలోమీటర్లదూరంలో ఉంది. అయితే, అక్కడ మందిరం ఉన్నట్లు ఏ ఆధారాలు లేవు. కర్నాటకలోని మైసూరులో అమ్మవారు చాముండేశ్వరీ దేవిగా పూజించబడుతోంది. తెలంగాణలోని ఆలంపూర్లో ఉన్న జోగులాంబ అమ్మవారి ఆలయం కూడా ఒక శక్తిపీఠమే. తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ స్థానంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలం కూడా ఒక శక్తిపీఠమే. అక్కడ అమ్మవారు భ్రమరాంబికా దేవిగా మల్లికార్జున స్వామి సమేతంగా భక్తులకు దర్శనమిస్తుంది. అంతేకాదు.. కృష్ణానదీ తీరాన ఉన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న అమ్మవారు మహాలక్ష్మిగా పూజలందుకుంటోంది. అమ్మవారి తలపై ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు సార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న మహార్లో ఉన్న శక్తిపీఠం ఏకవీరిక దేవిగా ప్రసిద్ధి. ఇక్కడి అమ్మవారిని రేణుకామాతగా కూడా పూజిస్తారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న అమ్మవారిని మహాకాళి అని పిలుస్తారు. ఈ క్షేత్రం క్షిప్రా నదీ తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు ఇక్కడి మహాకాళియే విద్యను ప్రసాదించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మరో శక్తిపీఠం పిఠాపురం. అక్కడి అమ్మవారిని పురుహూతికగా పూజిస్తారు. కుకుటేశ్వర స్వామి సమేతంగా పురుహూతిక అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తారు.
ఒడిశాలోని వైతరిణీ తీరంలో ఉన్న ఓఢ్యలో గిరిజాదేవిగా అమ్మవారు కొలువై ఉంది. ఈ క్షేత్రం జాజ్‌పూర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న మరో శక్తిపీఠం ద్రాక్షారామంలో అమ్మవారు మాణిక్యాంబగా భక్తులకు దర్శనమిస్తోంది. కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అసోంలోని బ్రహ్మపుత్రానది తీరంలో హరిక్షేత్రంలో కామరూపగా పార్వతీమాతను పూజిస్తున్నారు. ఈ శక్తిపీఠం గౌహతి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణీ సంగమం ప్రయాగలో అమ్మవారిని మాధవేశ్వరీ మాతగా కొలుస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా దగ్గరున్న జ్వాలాక్షేత్రంలో వైష్ణవీ మాతగా పూజిస్తారు. ఇక్కడ ఏడు జ్వాలలు పురాతన కాలం నుంచి వెలుగుతూనే ఉన్నాయని చెబుతారు. బిహార్‌లోని గయలో మంగళగౌరి మాతగా అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తారు. ఈ శక్తిపీఠం పట్నా నుంచి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి శక్తిపీఠంలో అమ్మవారు విశాలాక్షిగా దర్శనమిస్తోంది. జమ్ము కశ్మీర్లో ఉన్న అమ్మవారిని సరస్వతిగా కొలుస్తారు. అక్కడి అమ్మవారిని కీర్భవాని అని కూడా పిలుస్తారు. ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది. ముజఫరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఈ శక్తిపీఠం కొలువై ఉంది.
- సప్తగిరి గోపగోని, చీఫ్ సబ్ ఎడిటర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి