ఫేస్‌బుక్ ఉన్నతాధికారికి ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు!
ABN , First Publish Date - 2020-09-12T20:24:45+05:30 IST
ద్వేషపూరిత పోస్టులకు సంబంధించి ఫేస్‌బుక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో..భారత్‌లోని సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ తమ ముందు హాజరు కావాలంటూ ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది.

న్యూఢిల్లీ: ద్వేషపూరిత పోస్టులకు సంబంధించి ఫేస్‌బుక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో..భారత్‌లోని సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ తమ ముందు హాజరు కావాలంటూ ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 15న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ అల్లర్లు చెలరేగడం వెనుక ఫేస్ బుక్ పోస్టు ఉన్నాయని తెలిసీ యాజమాన్యం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఫేస్‌బుక్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఆదేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
‘ప్రత్యక్ష సాక్షుల వివరణలను పరిశీలించిన అనంతరం..ఢిల్లీ అల్లర్లు దర్యాప్తులో ఫేస్‌బుక్‌ను కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థగా పరిగణించాల్సి వస్తోంది’ అని ప్యానెల్ సభ్యులు తమ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ ఘటనకు సంబంధించి ఫేసబుక్ పాత్ర ఎంటో తెలుసుకునేందుకు స్వతంత్ర, నిష్పాక్షికమైన దర్యాప్తు చేపట్టాలని ప్రత్యక్ష సాక్షులందరూ అభిప్రాయపడ్డారు’ అని ప్యానెల్ వ్యాఖ్యానించింది.
సోషల్ మీడియా దుర్వినియోగం అంశంపై ఈ నెల మొదట్లో అజిత్ మోహన్‌ను కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే.. ఫేస్‌బుక్ ఎన్నడూ ద్వేషపూరిత వ్యాఖ్యలను ప్రోత్సహించదని, ఎటువంటి రాజకీయాలకు తావులేకండా అన్ని దేశాల్లోనూ ఒకేలా ఈ నిబంధన అమలవుతుందని ఫేస్‌బుక్ ఇటీవల వివరణ కూడా ఇచ్చింది.