అటల్‌ టన్నెల్‌ ప్రత్యేకతలివే..

ABN , First Publish Date - 2020-10-03T08:47:19+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్‌ టన్నెల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు...

అటల్‌ టన్నెల్‌ ప్రత్యేకతలివే..

  • ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగం
  • సైన్యానికి వ్యూహాత్మక సరఫరాలకు అవకాశం
  • పర్యాటక ప్రాంతంగానూ వృద్ధి చెందే చాన్సు


సిమ్లా: ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్‌ టన్నెల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహతాంగ్‌లో శనివారం ఈ సొ రంగ మార్గంలో ఆయన ప్రయాణిస్తారు. రూ.3,500 కోట్ల వ్యయంతో 9.02 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ టన్నెల్‌ సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున ఉంది. మనాలీ నుంచి లద్దాఖ్‌లోని లెహ్‌ వరకు 7 గం టల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతాయి. అన్నిటినీ మించి ఎంత మంచు కురిసినా రోడ్డును మూసివేయాల్సిన పని ఉండదు. లద్దాఖ్‌, అక్సా య్‌ చిన్‌ సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యానికి వ్యూహాత్మక (ఆయుధ/ఆహార) సరఫరాలకు అవకాశం ఏర్పడింది. మనాలీ నుంచి లాహోల్‌స్పీతి వ్యాలీ వరకు నిర్మించిన ఈ సొరంగం వల్ల శీతాకాలంతో పాటు అన్ని కాలాల్లో ఏడాది పొడవునా ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం సాయంత్రమే మనాలికి చేరుకున్నారు. మోదీ ప్రారంభించే సొరంగాన్ని తనిఖీచేశారు. ప్రధానితో కలిసి దక్షిణ ముఖ ద్వారం నుంచి ఉత్తర ద్వారానికి సొరంగ మార్గంలో ప్రయాణిస్తారు. మోదీ అక్కడి నుంచి దక్షిణ ద్వారం వైపు వెళ్లే హిమాచల్‌ ఆర్‌టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభిస్తారు.  


ఏమిటీ సొరంగం..?

లద్దాఖ్‌ వెళ్లాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి హిమాచల్‌లోని రోహతాంగ్‌ పాస్‌ గుండా వెళ్లే లెహ్‌-మనాలీ జాతీయ రహదారి. శీతాకాలంలో భారీ మంచు వర్షం, మంచు తుఫాన్ల కారణంగా ఈ రోడ్డు ఏడాదిలో 4 నెలల పాటే తెరచి ఉంటుంది. రెండో మార్గం కశ్మీరులోని జోజీ లా మీదుగా వెళ్లే శ్రీనగర్‌-ద్రా్‌స-కార్గిల్‌-లెహ్‌ జాతీయ రహదారి. ఇది కూడా మంచు వర్షం కారణంగా సంవత్సరంలో నాలుగు నెలలు మూసే ఉంటుంది. కీలకమైన పాక్‌, చైనా సరిహద్దులో సియాచిన్‌ గ్లేసియర్‌, అ క్సాయ్‌ చిన్‌లలో మన సైనికులు నిరంతర పహరా కాస్తున్నారు. వారికి ఆహార పదార్థాలను, ఆయుధాలను, ఇతర సామగ్రిని తీసుకెళ్లడానికి బాగా ఇబ్బందిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రోహతాంగ్‌ పాస్‌ కింద సొరంగం నిర్మించాలన్న ఆలోచన అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయికి వచ్చింది. 2002 మే 26న సొరంగం దక్షిణ ముఖ ద్వారానికి శంకుస్థాపన చేశారు. హిమాలయ పర్వతాల్లోని పీర్‌ పంజల్‌ ప్రాంతంలో సముద్ర మట్టానికి 3,071 మీటర్ల ఎత్తున అత్యాధునిక సాంకేతిక ఏర్పాట్లతో టన్నెల్‌ నిర్మాణం మొదలైంది. రోహతాంగ్‌ పాస్‌కు కాస్త పశ్చిమాన అడుగు భాగంలో నిర్మించిన ఈ సొరంగానికి నిరుడు డిసెంబరులో వాజపేయి 95వ జ యంతిని పురస్కరించుకుని ‘అటల్‌ టన్నెల్‌’ అని నామకరణం చేశారు.


గుర్రపు నాడా ఆకారంలో.. 

అటల్‌ సొరంగం గుర్రపు నాడా ఆకారంలో ఉం టుంది. టన్నెల్‌ 8మీటర్ల వెడల్పున, 5.525 మీటర్ల ఎత్తున ఉంది. లోపల రెండు వరుసల రహదారి ఉంది. ప్రతి 60 మీటర్లకు ఒక అగ్నిమాపక వ్యవస్థ, ప్రతి 150 మీటర్లకు ఓ టెలిఫోన్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి 500 మీటర్ల వద్ద అత్యవసర ద్వారం నిర్మించారు. ప్రతి 2.2కిలోమీటర్ల వద్ద గుహలు నిర్మించారు. వాయు కాలుష్యంపై ప్రతి కిలోమీటరు వద్దా హెచ్చరికలు చేసే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రతి 250 మీటర్ల వద్ద మైకు, సీసీటీవీ కెమేరాలు అమర్చారు. చిన్న సంఘటన జరిగినా పసిగట్టే సాంకేతిక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. ఇది సైనికంగా వ్యూహాత్మక మార్గంగానే గాక పర్యాటక ప్రాంతంగానూ ప్రసిద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. తద్వారా హిమాచల్‌, లద్దాఖ్‌లలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కోట్ల రూపాయల రవాణా ఖర్చు ఆదా అవుతుంది. 


అటల్‌ టన్నెల్‌ విశేషాలు..

  • సొరంగం నిర్మాణానికి ఖర్చు రూ.3,500 కోట్లు

  • కొత్త ఆస్ట్రియా టన్నెలింగ్‌ విధానంలో నిర్మాణం

  • 14,598 టన్నుల ఉక్కు, 2.37కోట సిమెంట్‌  

  • 14 లక్షల క్యుబిక్‌ మీటర్ల మట్టి, రాళ్ల తవ్వకం

  • మనాలీకి 25 కి.మీ. దూరంలో దక్షిణ ముఖ ద్వారం సముద్రమట్టానికి 3,060 మీటర్ల ఎత్తున 

  • లాహోల్‌ లోయలోని తెలింగ్‌ వద్ద ఉత్తర ముఖ ద్వారం సముద్రమట్టానికి 3,071 మీటర్ల ఎత్తున 

  • 587 మీటర్ల శేరి నాలా ఫాల్ట్‌ జోన్‌ వంపు తవ్వడం, సొరంగ నిర్మాణం అత్యంత క్లిష్టతరమైనది. ఇక్కడ రెండు వైపులా సొరంగం పూర్తి కావడానికి చాలాకాలం పట్టింది. 2017 అక్టోబ రు 15నాటికి రెండు ముఖ ద్వారాల నిర్మాణమూ పూర్తయింది. దాంతో హెలికాప్టర్‌ సేవ లు అందుబాటులో లేనప్పుడు పేషెంట్లను ఈ సొరంగం గుండా ఆస్పత్రులకు తరలించాలని నిర్ణయించారు.  అన్ని హంగులూ అమరడంతో శనివారం ప్రధాని ప్రారంభించనున్నారు.

Updated Date - 2020-10-03T08:47:19+05:30 IST