రంగరాజన్ నేతృత్వంలో ఓ కమిటీని ప్రకటించిన పళని సర్కార్

ABN , First Publish Date - 2020-05-09T23:53:17+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా ఏయే రంగాలు నష్టపోయాయి? ఎంత నష్టపోయాయి? తిరిగి రాష్ట్రంలో ఆర్థిక రంగాన్ని

రంగరాజన్ నేతృత్వంలో ఓ కమిటీని ప్రకటించిన పళని సర్కార్

చెన్నై : లాక్‌డౌన్ కారణంగా ఏయే రంగాలు నష్టపోయాయి? ఎంత నష్టపోయాయి? తిరిగి రాష్ట్రంలో ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించడానికి ఏమి చేయాలి? ఎంత ప్యాకేజీని ప్రకటించాలి? అన్న విషయంపై ముఖ్యమంత్రి పళనిస్వామి ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీకి ఆర్బీఐ మాజీ గవర్నర్ సి. రంగరాజన్ నేతృత్వం వహిస్తారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కృష్ణన్ సమన్వయ కర్తగా కొనసాగుతారు. లాక్‌డౌన్ ఎఫెక్ట్ నుంచి రాష్ట్రం తొందరగా కోలుకోవాలంటే ఏం చేయాలన్న దానిపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.


మూడు నెలల్లోగా ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా ఈ కమిటీ అందిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే లాక్‌డౌన్ ప్రభావం, సామాజిక దూరం పాటించడం, ముందు జాగ్రత్త చర్యల వల్ల రాష్ట్రంపై పడ్డ అదనపు భారం, ఆర్థిక చిక్కులను కూడా ఈ సంఘం అంచనా వేస్తుంది. వీటితో పాటు లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్న చిన్న, మధ్య తరగతి పరిశ్రమలపై పడ్డ ప్రభావాన్ని అధ్యయనం చేయడంతో పాటు మరిన్ని కీలకమైన రంగాలకు ఎలాంటి ప్యాకేజీని ప్రకటించాలో కూడా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.


అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఇప్పటి వరకూ పడ్డ భారం, మరింత భారం పడితే ఎలా తట్టుకోవాలి అన్న అంశాలతో పాటు ఖజానాను ఎలా నింపాలన్న కోణంలో కూడా ఈ కమిటీ పళని సర్కార్‌కు రంగరాజన్ నేతృత్వంలోని కమిటీ  సూచనలు చేయనుంది. 

Updated Date - 2020-05-09T23:53:17+05:30 IST