లడఖ్‌లో అమరుడైన జవాను కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం : సీఎం పళని స్వామి
ABN , First Publish Date - 2020-06-17T01:50:30+05:30 IST
లడఖ్‌లో చైనా సైనికుల దాడిలో భారత జవాన్లు అమరులు కావడం పట్ల తమిళనాడు

చెన్నై : లడఖ్‌లో చైనా సైనికుల దాడిలో భారత జవాన్లు అమరులు కావడం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిలో అమరుడైన తమిళనాడుకు చెందిన జవాను కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంతోపాటు, ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.
సోమవారం రాత్రి చైనా సైనికులు గాల్వన్ లోయలో విచక్షణ లేకుండా జరిపిన దాడిలో అమరులైన ముగ్గురు భారతీయుల్లో ఒకరు తమిళనాడుకు చెందినవారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, కడక్కలూర్ గ్రామస్థుడైన కే పళని ఈ దాడిలో అమరుడయ్యారు.
ముఖ్యమంత్రి పళని స్వామి ఓ సందేశంలో అమర జవాను పళని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. పళనితోపాటు ముగ్గురు సైనిక సిబ్బంది దేశ భద్రత కోసం ప్రాణ త్యాగం చేశారన్నారు.
అమర జవాను పళని కుటుంబ సభ్యులకు తక్షణమే రూ.20 లక్షలు ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పళని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామన్నారు.
అమర జవాను పళని కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కలిసి, వారిని ఓదార్చాలని రామనాథపురం జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పళనికి నివాళులర్పించాలని ఆదేశించారు.
ఇదిలావుండగా, గాల్వన్ లోయలో భారత్ సైనికులపై చైనా సైనికులు జరిపిన దాడిలో అమరులైనవారిలో ఓ తెలుగు బిడ్డ ఉన్నారు. ఆయన పేరు కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు. ఆయన తల్లిదండ్రులు సూర్యాపేట పట్టణంలోని విద్యా నగర్‌లో నివసిస్తున్నారు. ఆయన భార్యాబిడ్డలు ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన తల్లి మంజుల మాట్లాడుతూ తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం తనకు గర్వకారణమని తెలిపారు. అయితే ఓ బిడ్డకు తల్లిగా ఆమె సహజసిద్ధమైన ఆవేదన వ్యక్తం చేశారు.