కరోనా సోకిన పులికి వ్యాధినిరోధక ఔషధాలతో పశువైద్యుల చికిత్స

ABN , First Publish Date - 2020-04-07T16:19:18+05:30 IST

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి న్యూయార్క్ నగరంలోని జూపార్కులో కరోనా వైరస్ సోకిన ‘నదియా’ మలయన్ జాతి పులికి పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు....

కరోనా సోకిన పులికి వ్యాధినిరోధక ఔషధాలతో పశువైద్యుల చికిత్స

న్యూయార్క్ (అమెరికా): ప్రపంచంలోనే మొట్టమొదటిసారి న్యూయార్క్ నగరంలోని జూలో కరోనా వైరస్ సోకిన ‘నదియా’ మలయన్ జాతి పులికి  పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు. బ్రోంక్స్ జూలో కరోనా సోకిన నదియా పులికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఔషధాలు ఇవ్వడం వల్ల దీని ఆరోగ్యం మెరుగుపడుతుందని పశువైద్యాధికారులు చెప్పారు. నాలుగేళ్ల వయసు గల నదియా పులి కరోనా వల్ల తినడం మానేసింది. దీంతో జూ కీపర్లు ఈ పులిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ పులి ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కొన్ని వ్యాధినిరోధక మందులు ఇవ్వాలని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీకి చెందిన బ్రోంక్స్ జూ ప్రధాన పశువైద్యుడు పాల్ కాలే జూ కీపర్లకు సూచించారు. 


బ్రోంక్స్ జూలో మరో ఆరు పెద్ద పులులు పొడి దగ్గుతో బాధపడుతుండటంతో వాటికి కూడా వ్యాధినిరోధక మందులు అందిస్తున్నారు. జూలోని నాలుగు పులులు, మూడు సింహాలు స్వల్ప అనారోగ్యానికి గురవడంతో వాటికి యాంటీ బయాటిక్స్ మందులు ఇచ్చారు. దీంతో అవి కోలుకుంటున్నాయని జూ పశువైద్యులు చెప్పారు. పులుల ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల నుంచి శ్వాబ్ ను పరీక్షించాలంటే వాటికి అనస్థీషియా ఇవ్వాలి. కాని పులులు అనారోగ్యంతో ఉన్నందున వీటికి అనస్థీషియా ఇవ్వాలని భావించడం లేదని పశువైద్యుడు కాలే చెప్పారు. 

Read more