జడ్జీల్ని బెదిరిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-04-28T08:46:47+05:30 IST
‘‘కోర్టు తీర్పులను విమర్శించే హక్కు ప్రజలకు ఉంది. కానీ.. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించే హక్కు, న్యాయమూర్తుల నిజాయతీని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేవు. (న్యాయవ్యవస్థపై) చేసే ఆరోపణలు విమర్శల పరిధిని...

- తీర్పుల్ని విమర్శించే హక్కు ప్రజలకుంది
- న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించొద్దు
- బార్-బెంచ్ మధ్య సుహృద్భావం ఉండాలి: సుప్రీం
- ఇద్దరు న్యాయవాదులు సహా.. ముగ్గురు వ్యక్తులు
- కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు నిర్ధారణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ‘‘కోర్టు తీర్పులను విమర్శించే హక్కు ప్రజలకు ఉంది. కానీ.. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించే హక్కు, న్యాయమూర్తుల నిజాయతీని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేవు. (న్యాయవ్యవస్థపై) చేసే ఆరోపణలు విమర్శల పరిధిని దాటినా, కోర్టును అపఖ్యాతిపాలు చేసేలా ఉన్నా నిస్సందేహంగా అలాంటి వ్యాఖ్యలను, రాతలను కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం’’ అని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. జడ్జీలను బెదిరించే ప్రయత్నాలను కఠినంగా అడ్డుకోవాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, జస్టిస్ వినీత్ సరన్‌లపై నిందలు మోపుతూ, వారికి అపఖ్యాతి కలిగించేలా ఆరోపణలు చేసిన ముగ్గురు వ్యక్తులు (వారిలో ఇద్దరు న్యాయవాదులు) కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టుగా.. జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం నిర్ధారించింది. ఆ ముగ్గురూ.. విజయ్ కుర్లే (ఇండియన్ బార్ అసోసియేషన్ మహారాష్ట్ర, గోవా అధ్యక్షుడు), రషీద్ ఖాన్ పఠాన్ (హ్యూమన్ రైట్స్ సెక్యూరిటీ కౌన్సిల్ జాతీయ కార్యదర్శి), నీలేశ్ ఓఝా (ఇండియన్ బార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు). వీరిలో విజయ్‌కుర్లే ఇండియన్ బార్ అసోసియేషన్ తరఫున గత ఏడాది మార్చిలో రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టి్‌సకు, బాంబే హైకోర్టు చీఫ్ జస్టి్‌సకి లేఖలు రాశారు. జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, జస్టిస్ వినీత్ సరన్‌లను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతివ్వాలని.. మార్చి 12 అడ్వొకేట్ నెడుంపరపై కోర్టు ధిక్కారం కింద శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినందున వారిని జ్యుడీషియల్ వర్క్‌నుంచి తొలగించాలని అందులో కోరారు. రషీద్ ఖాన్ పఠాన్ కూడా అదే కోవలో లేఖ రాశారు.
సోమవారం దీనిపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన ధర్మాసనం.. వారి లేఖల్లో ఉన్న విషయాలన్నీ కోర్టు ధిక్కారం కిందకే వస్తాయని పేర్కొంది. నీలేశ్ ఓఝా ఎలాంటి లేఖా రాయకపోయినా.. ఆయన అధిపతిగా ఉన్న ఇండియన్ బార్ అసోసియేషన్‌కు చెందిన ఒక రాష్ట్ర విభాగం అధ్యక్షుడు అలాంటి లేఖలు రాస్తే ఆ బాధ్యత నుంచి ఓఝా తప్పించుకోజాలరని స్పష్టం చేసింది. ‘‘బెంచ్‌కు, బార్‌కు మధ్య పరస్పర గౌరవంతో కూడిన సుహృద్భావ సంబంధం ఉండాలి. న్యాయమూర్తులను బెదిరించేందుకు ప్రయత్నించే న్యాయవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. అలాంటి న్యాయవాదుల పట్ల నిరాధారమైన దయ చూపాల్సిన పని లేదు.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను మే ఒకటికి వాయిదా వేసింది.