‘భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’ నినాదాలను వ్యతిరేకించేవారు జట్టు కట్టారు : మోదీ

ABN , First Publish Date - 2020-11-03T21:02:09+05:30 IST

బిహార్ శాసన సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

‘భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’ నినాదాలను వ్యతిరేకించేవారు జట్టు కట్టారు : మోదీ

న్యూఢిల్లీ : బిహార్ శాసన సభ ఎన్నికల ప్రచారాన్ని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బిహార్ ప్రజలు ఈ నినాదాలు చేయకూడదని ఎన్డీయే ప్రత్యర్థులు కోరుకుంటున్నారని ఆరోపించారు. అలాంటివారంతా జట్టు కట్టారన్నారు. ఈ ఎన్నికల్లో అలాంటివారికి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. ‘భారత్ మాతా కీ జై’ అని నినదించేవారితో ఇబ్బందిపడేవారి వల్ల బిహారీలకు కూడా ఇబ్బందేనని తెలిపారు. సహర్సలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. 


నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనడాన్ని మోదీ కొట్టిపారేశారు. గత దశాబ్దంలో ప్రజల మౌలిక అవసరాలను తీర్చారని చెప్పారు. విద్యుత్తు, వంట గ్యాస్ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి గత దశాబ్దంలో కృషి చేసినట్లు తెలిపారు. ఇకపై ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. 


బిహార్‌లో రౌడీయిజం, దోపిడీలకు కాలం చెల్లిందని, అభివృద్ధి, చట్టబద్ధ పాలన గెలుస్తున్నట్లు తెలిపారు. కుటుంబ పాలన ఓడిపోయి, ప్రజాస్వామిక పాలన విజయం సాధిస్తున్నట్లు చెప్పారు. 1990వ దశాబ్దంలో పేదల ఓటు హక్కును కూడా కొల్లగొట్టారని, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అణగారిన వర్గాలకు సాధికారత కల్పించిందని చెప్పారు. ఆర్జేడీ అరాచక పాలన చీకటి రోజులను నితీశ్ కుమార్ వెనుకకు నెట్టేశారని చెప్పారు. 


బిహార్ శాసన సభ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ఈ నెల 7న జరుగుతుంది, ఓట్ల లెక్కింపు ఈ నెల 10న జరుగుతుంది. 


Updated Date - 2020-11-03T21:02:09+05:30 IST