‘రజనీ సార్.. పార్టీ పెడితే ఆ పాట ప్లస్ పాయింట్..’
ABN , First Publish Date - 2020-12-11T16:16:48+05:30 IST
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈనెల 14 నుంచి
- మూడోసారి మండ్రం నేతలతో రజనీ భేటీ
- పార్టీ జెండా, గుర్తుపై చర్చలు
చెన్నై : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈనెల 14 నుంచి ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొనాల్సి వుండటంతో కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ పతాకం, చిహ్నం ఎంపిక తదితర అంశాలపై మండ్రం నేతలతో ముమ్మరంగా చర్చిస్తున్నారు. బుధవారం కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపం లో మక్కల్ మండ్రం జిల్లా శాఖ నేతలు, నియోజ కవర్గాల ఇన్‌ఛార్జిలతో రజనీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రజనీ సలహాదారులుగా ఉన్న తమిళురివి మణియన్, అర్జున్ మూర్తి కూడా పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ మహానాడు నిర్వహించడం, నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల ను ఎంపిక చేయడం, ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే విషయాలపై రజనీ మండ్రం నేత లతో సమగ్రంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో గురువారం మళ్ళీ మక్కల్‌మండ్రం నేతలతో ఎలాంటి హాడావుడి లేకుండా రజనీ సమావేశమయ్యారు. గురువారం నాటి సమావేశం సమాచా రాన్ని ప్రసారమాధ్యమాలకు తెలుపకపోవడం గమనార్హం.
ఈ సమావేశంలో పార్టీ పతాక రూపకల్పన, చిహ్నం ఎంపికపై ఆయన చర్చించారు. ఈ సమావేశానికి కూడా తమిళురిమ ణియన్, అర్జున్‌మూర్తి హాజరయ్యారు. రజనీ అభిమాన సంఘాలు, మక్కల్ మండ్రం దశాబ్దాల తరబడి ఉపయోగిస్తున్న పతాకం నీలిరంగులో వుంటోంది. మధ్యలో నక్షత్రం గుర్తు వుంది. ఈ పతాకాన్ని ఎన్నికలలో ఉపయోగించకుండా కొత్తగా పార్టీ పతాకాన్ని రూపొందించాలని రజనీ భావిస్తున్నారు. ఈ కొత్త పతాకంలో ఏయే రంగులుండాలి. అందులో ఏవైనా గుర్తుగానీ, తన ఫొటో గానీ ముద్రించాలా? అనే విషయాలపై మండ్రం నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీకి ఏంపేరు పెట్టాలనే విషయంపై కూడా తీవ్రంగా చర్చలు జరిపారు. పార్టీ పేరులో ‘కళగం’ అనే పదం లేకుండా ఉండాలని మండ్రం నేతల్లో చాలా మంది రజనీకి సూచించారు. ప్రజలు పలికేందుకు సులువగా ఉండేలా పార్టీకి పేరుపెట్టాలని కోరారు.
సైకిల్‌పైనే ఆసక్తి
ఇక పార్టీ గుర్తుగా సైకిల్‌ను ఎంపిక చేయాలని మండ్రం నేతలంతా రజనీకి సూచించారు. రజనీ నటించిన అన్నామలై చిత్రంలో పాలవాడిగా సైకిల్‌పై పాడే పాటను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడం ప్లస్‌పాయింట్ అవుతుందని కూడా తెలిపారు. అంతేకాకుండా గతంలో సైకిల్ గుర్తుపై పోటీ చేసిన తమిళ మానిల కాంగ్రెస్ డీఎంకేతో పొత్తుపెట్టుకుని గెలిచిన విషయాన్ని మరువకూడదన్నారు. రెండు వారాల్లోగా పార్టీ గుర్తును ఎంపిక చేస్తానని రజనీ వారికి హామీ ఇచ్చారు.

అభిమానులతో బర్త్‌డే?
గత కొన్నేళ్ళుగా రజనీ తన పుట్టినరోజు వేడుకలను బెంగళూరుకు వెళ్ళి కుటుంబీకుల నడమ నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. కొన్నిసార్లు ఆయన సినిమా షూటింగ్‌ల్లో బిజీగా వుంటూ ఆయా షూటింగ్ స్పాట్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గత మూడేళ్ళుగా కోట్లాదిమంది అభిమానులు రజనీ పుట్టినరోజు వేడుకలను తమ మధ్య జరుపుకోవాలని రజనీపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం రజనీ బెంగళూరుకు వెళ్ళినప్పుడు, పుట్టినరోజు వేడుకలను ఈసారి కూడా అక్కడే జరుపుకుంటారని అభిమానులు, మండ్రం నేతలు అనుకున్నారు. ఊహించని విధంగా పార్టీ ఏర్పాటుపై తగు నిర్ణయాలు తీసుకోవాల్సి వుండటంతో మరుసటి రోజే రజనీ బెంగళూరు నుంచి బయల్దేరి చెన్నైకి వచ్చేశారు. అంతే కాకుండా హుటాహుటిన మక్కల్ మండ్రం నేతలతో సమావేశం జరిపారు.

గురువారం కూడా మండ్రం నేతలతో చర్చలు జరిపారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 12న రజనీ తన పుట్టినరోజు వేడుకలను చెన్నైలో అభిమానుల మధ్య ఘనంగా జరుపుకుంటారని తెలుస్తోంది. ఈ విషయం గురించి గురువారం జరిగిన మండ్రం నేతల సమావేశంలో రజనీ ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనం పాటించారు. జనవరిలో పార్టీని పెడు తున్న సమయంలో తన అభిమానులలో, మండ్రం నేతలు, సభ్యుల మధ్య ఉత్సాహాన్ని నింపేందుకు రజనీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రజనీ ప్రస్తుతం ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం ఈనెల 14న హైదరాబాద్‌కు వెళ్ళాల్సి వుంది. ఆలోగా అభిమానులను నిరుత్సాహపరచడం ఎందుకని రజనీ వారి మధ్య చెన్నై నగరంలోనే బర్త్‌డే వేడుకలు జరుపుకుంటారని మండ్రం సీనియర్ నేతలు చెబుతున్నారు.
