ఒకే పాసుతో సరిపెట్టండి.. సరిహద్దు ఆంక్షలపై సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-06-04T21:38:31+05:30 IST

పరస్పర భిన్నమైన నిబంధనల కారణంగా నొయిడా, ఢిల్లీ, గురుగావ్‌ మధ్య పర్యటించే రోజువారీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ..

ఒకే పాసుతో సరిపెట్టండి.. సరిహద్దు ఆంక్షలపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పరస్పర భిన్నమైన నిబంధనల కారణంగా నొయిడా, ఢిల్లీ, గురుగావ్‌ మధ్య పర్యటించే రోజువారీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు గురువారంనాడు స్పందించింది. వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.


'ఎన్‌సీఆర్ ప్రాతంలో అంతర్రాష్ట్ర రాకపోకలకు సంబంధించి ఉమ్మడి మార్గాన్ని నిర్ణయించేందుకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశిస్తున్నాం' అని జస్టిస్ అశోక్ భూషణ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. ప్రస్తుతం అమలు చేస్తున్న మూడు పాసులకు బదులుగా ఎన్‌సీఆర్ గుర్తింపుతో ఒకే పాసు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని ధర్మాసనం సిఫారసు చేసింది.


అంతర్రాష్ట్ర రాకపోకలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతించినప్పటికీ, వాస్తవిక ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు అమలు చేసే అధికారం స్థానిక యంత్రాంగానికి కల్పించింది. గత వారం రోజులుగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ సరిహద్దుల్లో విధించిన ఆంక్షలు రోజువారీ ప్రయాణికులకు ఇబ్బందిగా పరిణమిస్తోంది. అన్‌లాక్ 1.0లో బోర్డర్లు తెరిచేది లేదని నొయిడా అధికారులు నొక్కిచెబుతున్నారు. హర్యనా అధికారులు తొలుత సరిహద్దులను తెరవాలని అనుకున్నప్పటికీ డిల్లీ ప్రభుత్వం సిటీని సీల్ చేయడంతో వారు సైతం ఆంక్షలను తిరిగి అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం, అత్యవసర సర్వీసులు, స్పెషల్ ట్రావెల్ పర్మిట్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మూడు రాష్ట్రాలు మూడురకాల ఇ-పాస్‌లు ఇస్తుండటం, ఇ-పాస్‌ల కోసం వేర్వేరు నిబంధనలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో వాటిపై సుప్రీంకోర్టు గురువారంనాడు విచారణ చేపట్టింది.

Updated Date - 2020-06-04T21:38:31+05:30 IST