అందరూ కోట్లేస్తున్నారు. ఆర్థిక మాంద్యమెక్కడుంది?: బీజేపీ ఎంపీ
ABN , First Publish Date - 2020-02-10T17:03:43+05:30 IST
దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుందన్నది అవాస్తవమని దానికి సాక్ష్యం ప్రజలంతా దోతీలకు బదులు కోట్లు ధరిస్తున్నారని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వీరేంద్ర సింగ్ అన్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో
లఖ్‌నవూ: దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుందన్నది అవాస్తవమని దానికి సాక్ష్యం ప్రజలంతా దోతీలకు బదులు కోట్లు ధరిస్తున్నారని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వీరేంద్ర సింగ్ అన్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.
‘‘ఢిల్లీ సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం గురించి చర్చించుకుంటున్నారు. దేశంలో ఆర్థికమాంద్యం కొనసాగుతోందని కూడా చాలా మంది చెబుతున్నారు. ఒకవేళ ఆర్థికమాంద్యమే ఉంటే ప్రజలు కుర్తాలు, కోట్లు ఎలా ధరిస్తారు? అందరూ దోతీల్లో కనిపించేవారు. నిజంగానే ఆర్థిక మాంద్యం ఉంటే పైజామాలు, ప్యాంట్లు మనకు కనిపించవు’’ అని పబ్లిక్ మీటింగ్‌లో వీరేంద్ర సింగ్ అన్నారు.
‘‘నేను మీకో విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఈ దేశంలో 6.5 లక్షల గ్రామాలు ఉన్నాయి. దేశ జనాభా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల్లో కంటే ఈ గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. మహాత్మగాంధీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్లు కూడా ఈ దేశ పట్టుకొమ్మలు గ్రామాలేనని అన్నారు. దేశమంటే మెట్రోపాలిటన్ నగరాలు కాదు, గ్రామాలే. గ్రామీణ ఆర్థికం బలోపేతంపై మా ప్రభుత్వం పని చేస్తుంది’’ అని వీరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.