మోదీ, అమిత్ షాలపై వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన అమెరికా కోర్టు

ABN , First Publish Date - 2020-12-15T19:49:42+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై దాఖలైన

మోదీ, అమిత్ షాలపై వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన అమెరికా కోర్టు

వాషింగ్టన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై దాఖలైన వ్యాజ్యాన్ని అమెరికా కోర్టు తోసిపుచ్చింది. దీనిని దాఖలు చేసిన పిటిషనర్లు వేర్పాటువాద కశ్మీరు ఖలిస్థాన్ సంస్థ, ఇద్దరు అసోసియేట్లు రెండు షెడ్యూల్డు విచారణలకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2019 సెప్టెంబరు 19న ఈ వ్యాజ్యం దాఖలైంది. 


టెక్సాస్‌లోని హూస్టన్‌లో ‘‘హౌడీ, మోదీ’’ కార్యక్రమానికి కొద్ది రోజుల ముందు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. ఈ చర్యలకు నష్టపరిహారంగా 100 మిలియన్ డాలర్లు చెల్లించాలని మోదీ, షా, లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్ ధిల్లాన్‌లను ఆదేశించాలని కోరారు. ధిల్లాన్ ప్రస్తుతం డైరెక్టర్-జనరల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా సేవలందిస్తున్నారు. 


కశ్మీర్ ఖలిస్థాన్ రిఫరెండం ఫ్రంట్, టీఎఫ్‌కే, ఎస్ఎంఎస్ (వీరి వివరాలు సమర్పించలేదు. కేవలం ఈ అక్షరాలను మాత్రమే పేర్కొన్నారు) ఈ దావాను దాఖలు చేశారు. వీరి తరపున వేర్పాటువాద న్యాయవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రాతినిధ్యం వహించారు. ఈ కేసు విచారణకోసం నిర్ణయించిన రెండు షెడ్యూలింగ్ కాన్ఫరెన్స్‌లకు పిటిషనర్లు హాజరు కాలేదని, అందువల్ల ఈ కేసును డిస్మిస్ చేయాలని అక్టోబరు 6న యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్ జడ్జి ఫ్రాన్సెస్ హెచ్ స్టేసీ సిఫారసు చేశారు. అక్టోబరు 22న టెక్సాస్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ఆండ్రూ ఎస్ హానెన్ టెర్మినేట్ చేశారు. 


ఆగస్టు 2, అక్టోబరు 6 తేదీల్లో షెడ్యూల్డు కాన్ఫరెన్స్‌లకు పిటిషనర్లు హాజరుకాలేదని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని డిస్మిస్ చేయాలని సిఫారసు చేశానని జడ్జి స్టేసీ చెప్పారు. రెండు వారాల తర్వాత ఈ వ్యాజ్యాన్ని జడ్జి హానెన్ టెర్మినేట్ చేశారు.


Updated Date - 2020-12-15T19:49:42+05:30 IST