నిరసన రైతుల హక్కు
ABN , First Publish Date - 2020-12-06T06:50:20+05:30 IST
రాజధాని శివార్లలో లక్షల మంది రైతుల నిరసన హోరుపై ప్రపంచదేశాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. ’ఈ నిరసన రైతుల హక్కు.

ప్రభుత్వం అడ్డుకోరాదు: ఐరాస
భారత్‌తో మాట్లాడండి
ప్రధాని బోరిస్‌కు 36 మంది
బ్రిటిష్ ఎంపీల సూచన
వ్యాఖ్యలపై వెనక్కి తగ్గని ట్రూడో
న్యూఢిల్లీ, డిసెంబరు 5: రాజధాని శివార్లలో లక్షల మంది రైతుల నిరసన హోరుపై ప్రపంచదేశాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. ’ఈ నిరసన రైతుల హక్కు. తాము విభేదించే అంశాలపై శాంతియుతంగా ప్రదర్శనలు చేయడం వారికున్న ప్రజాస్వామ్య హక్కు. అధికారులు వారిని అడ్డుకోరాదు. ఏ దేశానికైనా మేం ఇదే చెబుతాం’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఏంటానియో గ్యుటెరిస్ ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ అన్నారు. భారత్‌లో రైతుల ప్రదర్శనలపై సమితి నేరుగా స్పందించడం ఇదే ప్రథమం. ఈ విషయంలో జోక్యం చేసుకుని భారత్‌తో మాట్లాడాల్సిందిగా బ్రిటన్‌లో 36 మంది అఖిలపక్ష ఎంపీలు బోరిస్ జాన్సన్ సర్కార్‌ను కోరారు. బ్రిటన్‌లో ఉన్న వేలాది మంది పంజాబీలు ఎంతో ఆందోళనతో ఉన్నారని, ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌తో మాట్లాడాలని కోరుతూ ఆ ఎంపీలు బ్రిటిష్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్‌కు ఓ లేఖ రాశారు.
మరోపక్క- భారత్ కెనడా మధ్య రైతుల ఆందోళనపై రేగిన దౌత్య వివాదం మరింత ముదురుతోంది. శాంతియుతంగా అన్నదాతలు చేస్తున్న ప్రదర్శనలకు మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోమారు స్పష్టం చేశారు. భారత ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం వద్దనీ, దీని వల్ల ఇరుదేశాల సంబంధాలు దెబ్బతింటాయని న్యూఢిల్లీలోని కెనడా రాయబారిని భారత విదేశాంగ శాఖ శుక్రవారం పిలిపించి హెచ్చరించింది. ఆ హెచ్చరికను ట్రూడో ఖాతరు చేయలేదు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా తమ హక్కుల కోసం శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్నపుడు వారి పక్షాన కెనడా నిలబడుతుంది అంటూ ఆయన ఇదే వాక్యాన్ని రెండుమార్లు అన్నారు. దీనిపై భారత్ మండిపడింది.