ర్యాపిడ్ కరోనా టెస్టులను నిలిపివేసిన రాజస్థాన్! కారణమేంటంటే..

ABN , First Publish Date - 2020-04-21T21:04:55+05:30 IST

ర్యాపిడ్ టెస్టుల ఫలితాల్లో ఆశించిన కచ్చితత్వం లేని కారణంగా ఈ తరహా టెస్టులను నిలిపివేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది.

ర్యాపిడ్ కరోనా టెస్టులను నిలిపివేసిన రాజస్థాన్! కారణమేంటంటే..

జైపూర్: కరోనా ర్యాపిడ్ టెస్టుల ఫలితాల్లో ఆశించిన కచ్చితత్వం లేని కారణంగా ఈ తరహా టెస్టులను నిలిపివేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం భారత్ వైద్య పరిశోధన మండిలికి కూడా సమాచారం అందించింది. ఫలితాల్లో 90 శాతం కచ్చితత్వం ఆశించామని అయితే ర్యాపిడ్ పరీక్షల కిట్లు కేవలం 5.4 శాతం కచ్చితత్వాన్ని ఇచ్చాయని ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు. 


అంతకుమునుపు ప్రభుత్వం.. ఈ ర్యాపిడ్ పరీక్ష కచ్చితత్వాన్ని అంచనా వేసేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి చెందిన మైక్రోబయాలజి, మెడిసిన్ డిపార్ట్‌మెంట్ల నిపుణులతో ఈ కమిటీని నియమించింది. వారు జరిపిన అధ్యయనంలో ఫలితాల కచ్చితత్వం కేవలం 5.4 శాతమేనని తేలడంలో... వీటి వాడకం నిలిపివేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ‘వారి సూచన ఆధారంగా మేము ర్యాపిడ్ కిట్ల వాడకాన్ని నిలిపివేశాము. ఈ విషయాన్ని ఐసీఎమ్ఆర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశాము. వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాము’ అని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. 


సమాజంలో వ్యాధి వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఈ పరిక్షల ద్వారా కరోనా వ్యతిరేక యాంటీబాడీల శరీరంలో ఉన్నాయో లేదో తెలుస్తుంది. దీని ద్వారా ఎంతమంది కరోనా వైరస్‌ను ఎదుర్కొన్నారనేదానిపై ఓ అంచనాకు రావచ్చు. అయితే ర్యాపిడ్ పరీక్ష‌ల్లో పాజిటివ్ వచ్చినప్పటికీ.. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలో కూడా పాజిటివ్ అని వస్తేనే ఓ వ్యక్తి కరోనా బారిన పడినట్లు భావించాలని డాక్టర్లు చెబుతున్నారు.   

Updated Date - 2020-04-21T21:04:55+05:30 IST