కొత్త పార్లమెంటు భవనం..స్వావలంబనకు ప్రతీక

ABN , First Publish Date - 2020-12-11T09:07:04+05:30 IST

కొత్త పార్లమెంటు భవనానికి చేసే శంకుస్థాపన.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ప్రధాని మోదీ అన్నారు.

కొత్త పార్లమెంటు భవనం..స్వావలంబనకు ప్రతీక

పాత భవనం చరిత్రాత్మకం

రాజ్యాంగ చర్చలు, రూపకల్పన ఇక్కడే

మొదటి ప్రభుత్వమూ ఇక్కడే 

ఎన్నో చట్టాలు, ఎన్నెన్నో చర్చలు

అయినా నూరేళ్లకు చేరువలో ఉంది

దానికి ఇక విశ్రాంతి అవసరం

ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన

నూతన భవంతికి భూమిపూజ

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు ప్రత్యక్ష సాక్షి.. మన ప్రజాస్వామ్య చరిత్రలోనే మైలురాయి


న్యూఢిల్లీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కొత్త పార్లమెంటు భవనానికి చేసే శంకుస్థాపన.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర్యానంతర భారతానికి పాత (ప్రస్తుత) పార్లమెంటు భవనం మార్గదర్శనం చేస్తే.. నిర్మించబోయే కొత్త భవనం ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుందని పేర్కొన్నారు. నవీన, స్వావలంబన భారతానికి నూతన పార్లమెంటు ప్రతీకగా నిలుస్తుందని ఆకాంక్షించారు. గురువారమిక్కడ నూత న పార్లమెంటు భవనానికి ఆయన భూమిపూజ నిర్వహించి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి హాజరైన అతిథులనుద్దేశించి ప్రసంగించారు. ‘దేశహితమే పరమావధి. మనం తీసుకునే ప్రతి నిర్ణ యం దేశాన్ని బలోపేతం చేయాలి.


భారత్‌ ఫస్ట్‌ అని ప్రజలంతా సంకల్పించాలి’ అని పిలుపునిచ్చారు. భారతీయులు మన ప్రజాస్వామ్య చరిత్రను ప్రపంచానికి చాటిచెబితే మన దేశాన్ని ‘ప్రజాస్వామ్య మాత’గా అభివర్ణించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ‘ఈ రోజు ఎంతో చరిత్రాత్మకమైనది. ప్రజాస్వామ్య భారతంలో మైలురాయి. భారతీయులందరం కలిసికట్టుగా పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మిస్తాం. 2022లో భారత్‌ 75వ స్వాతంత్య్ర దినం జరుపుకొనేటప్పుడు ఈ నూతన భవనం స్ఫూర్తిగా నిలుస్తుంది’ అన్నారు. తొలిసారి ఎంపీగా 2014లో పార్లమెంటు భవనంలో అడుగుపెట్టిన క్షణాలను మరచిపోలేనని, అడుగుపెట్టే ముందు ఈ ప్రజాస్వామ్య దేవాలయానికి ప్రణామం చేశానని గుర్తుచేసుకున్నారు. ప్రధాని ఇంకా ఏమన్నారంటే.. 


ప్రస్తుత భవనానిది కీలక భూమిక..

ప్రస్తుత పార్లమెంటు భవనం స్వాతంత్ర్యానికి ముం దు, తర్వాత కీలక భూమిక పోషించింది. అయితే ఎప్పటికప్పుడు నవీకరిస్తూ వస్తున్నా ఈ భవనాన్ని నిర్మించి నూరేళ్లు పూర్తికావచ్చిందన్న వాస్తవాన్ని అందరూ అంగీకరించాలి. ఇక దానికి విశ్రాంతి అవసరం. ఈ భవనంలో దేశ అవసరాలను తీర్చే పనులు జరిగితే.. కొత్త భవంతిలో 21వ శతాబ్దపు ఆకాంక్షలను నెరవేర్చాలి.


ఆ జోస్యాలు తప్పని నిరూపించాం..

భారత్‌లో ప్రజాస్వామ్యం నిలబడదని గతంలో అన్నా రు. ఆ జోస్యాలన్నీ తప్పని నిరూపించాం. 21వ శతాబ్ది లో భారత్‌ కీలక ప్రజాస్వామిక శక్తిగా దూసుకెళ్తోందని భారతీయులు సగర్వంగా చెప్పొచ్చు. భారత ప్రజాస్వా మ్యం శతాబ్దాల అనుభవాల ఆధారంగా అవతరించిన వ్యవస్థ. మనదేశంలో ప్రజాస్వామ్యం ఓ జీవన విధానం.. విలువ.. పరిపాలన.. విభేదాల పరిష్కారానికి మార్గం. విధానాలు, రాజకీయాలు వేర్వేరు అయినప్పటికీ ప్రజాసేవే అంతిమ లక్ష్యం కావాలి. పార్లమెంటు లోపల, వెలుపల జరిగే చర్చల్లో దేశసేవ దిశగా సంకల్పం, జాతీయ ప్రయోజనాల దిశగా అంకిత భావం ప్రతిఫలించాలి. పార్లమెంటులో అడుగుపెట్టే ప్రతి సభ్యుడూ ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీ. ఈ ప్రజాస్వామ్య దేవాలయాన్ని పవిత్రంగా ఉంచడం కంటే పరమార్థం లేదు. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడడం కంటే జీవితంలో గొప్ప లక్ష్యం లేదని అందరూ ప్రతినబూనాలి.


200 మంది అతిథులు..

శంకుస్థాపన కార్యక్రమానికి సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీచైర్మన్‌ హరివంశ్‌, ప్రహ్లాద్‌ జోషి, హర్‌దీ్‌పసింగ్‌ పురి తదితర కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు, లోక్‌సభ మాజీ స్పీకర్‌ శివరాజ్‌ పాటిల్‌, పలు దేశాల రాయబారులు,భవన నిర్మాణ కాంట్రాక్టు పొందిన ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా సహా 200 మంది అతిథులు హాజరయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పంపిన సందేశాలను హరివంశ్‌ చదివి వినిపించారు.


ప్రధాని నోట ప్రాచీన చరిత్ర..

 13వ శతాబ్దంలో రూపొందించిన మాగ్నాకార్టా హక్కుల పత్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అది ప్రజాసామ్య సౌధమని కొందరు మేధావులు అంటా రు. అయితే దీనికి ముందు 12వ శతాబ్దిలోనే బసవేశ్వరు డి ‘బసంత మంటపం’ పార్లమెంటు గురించి చెప్పిందన్న ది కూడా అంతే వాస్తవం. అనుభవ మంటపం పేరిట ఆయన ‘లోక్‌ పార్లమెంటు’ను నెలకొల్పి ప్రజాస్వామ్యయుతంగా నడిపి చూపించారు. 


 పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్య హయాంలో చెన్నైకి 80-85 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరమెరూర్‌ గ్రామంలో పంచాయతీ వ్యవస్థ గురించి శిలాఫలకాలపై తమిళంలో రాసి ఉంది.గ్రామాలను కుడుంబులు (వార్డులు)గా వర్గీకరించి ఒక్కో కుడుంబు నుంచి ప్రతినిధిని జనరల్‌ అసెంబ్లీకి పంపేవారు. వేల ఏళ్ల కిందటే మహాసభ ఉండేది. ఇప్పుడూ అది కొనసాగుతోంది.


 శతాబ్దాల కిందటే శాక్య, మల్లంచ, వెజ్జి వంటి గణరాజ్యాలు.. మౌర్య సామ్రాజ్యంలో లిచ్చవి, కాంభోజ, కళింగ వంటి గణరాజ్యాలు పాలనా వ్యవస్థకు ప్రజాస్వామ్యాన్ని మూలంగా చేశా యి. వేల సంవత్సరాల కింద రాసిన మన వేదాల్లో.. ముఖ్యంగా రుగ్వేదంలో ‘సమష్టి కృషి’ అనే ప్రజాస్వామ్య భావన ఉంది. ప్రపంచం ఉన్నంత వరకు ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరగాలని గురునానక్‌ దేవ్‌జీ చెప్పారు. 


శృంగేరి మఠం ఆధ్వర్యాన..

నూతన పార్లమెంటుకు శంకుస్థాపన బాధ్యతను కర్ణాటకకు చెందిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి అప్పగించారు. ఆయన శృంగేరి శారదాపీఠాధిపతి జగద్గురు శ్రీభారతీతీర్థ మహాస్వామిని సంప్రదించారు. భూమిపూజ నిర్వహించేందుకు స్వామి ఆరుగురు పురోహితుల(వి.శివకుమార్‌ శర్మ, కేఎస్‌ లక్ష్మీనారాయణ సోమయాజి, కేఎస్‌ గణేశ్‌ సోమయాజి, నాగరాజ ఆడిగ, రాఘవేంద్ర భట్ట, రుష్యశృంగ) బృందాన్ని ఢిల్లీ పంపించారు. వీరు గురుపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, ఆదికేశ పూజ, అనంత పూజ, వరాహ, భువనేశ్వరి పూజలు నిర్వహించారు. శంకుస్థాపన జరిగే ప్రదేశంలో ఉంచేందుకు శృంగేరి పీఠం ప్రత్యేక శంఖాన్ని, నవరత్న పీఠాన్ని కూడా పంపింది. క్రతువు మధ్యాహ్నం 12.55 గంటలకు ప్రారంభమైంది. ఒంటిగంటకు భూమిపూజ, 1.30 గంటలకు సర్వమత ప్రార్థనలు జరిగాయి.


పార్టమెంట్‌ భవన నిర్మాణం జరిగి నూరేళ్లు పూర్తికావచ్చిందన్న వాస్తవాన్ని అందరూ అంగీకరించాలి. ఇక దానికి విశ్రాంతి అవసరం. ఈ భవనంలో దేశ అవసరాలను తీర్చే పనులు జరిగితే.. కొత్త భవంతి 21వ శతాబ్దపు ఆకాంక్షలను నెరవేర్చాలి.

 ప్రధాని మోదీ





Updated Date - 2020-12-11T09:07:04+05:30 IST