ఎవరినైనా ఎక్కడైనా పరీక్షించొచ్చు
ABN , First Publish Date - 2020-03-13T08:39:19+05:30 IST
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో కేంద్రం అంటువ్యాధుల నిరోధక చట్టాన్ని...

అంటువ్యాధుల చట్టంతో అధికారులకు పవర్
న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో కేంద్రం అంటువ్యాధుల నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది బ్రిటిష్ కాలం నాటి (1897) నాటి చట్టం. ఇందులో సెక్షన్ 2లో ఉన్న నిబంధనలు అత్యంత కీలకం. వీటి ప్రకారం...
- అంటువ్యాధులు ప్రబలితే ప్రత్యేక చర్యలను సర్కారు తీసుకోవచ్చు. ప్రజలపై నియంత్రణలు విధించవచ్చు.
- రైళ్లలో, బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని తనిఖీ చేయవచ్చు. వ్యాధి ఉన్నట్లు ధ్రువపడితే వారిని అప్పటికప్పుడు ఆసుపత్రులకో, ప్రత్యేక నివాస స్థలాలకో తరలించవచ్చు.
- తనిఖీలు చేసే అధికారులకు అనుమానమొచ్చినా వారిని ఆసుపత్రులకో, లేక ఐసోలేషన్‌కో తరలించవచ్చు
- దేశం నుంచి వెళ్లే లేదా వచ్చే నౌకలపై నియంత్రణ విధించవచ్చు. అందులో ప్రయాణించేవారి, సిబ్బందిపై కూడా నియంత్రణలు విధించవచ్చు.
- ఓ అంటువ్యాధి సోకడం, విస్తరించడం జరిగినపుడు దాన్ని నియంత్రించడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవు అని భావించిన పక్షంలో ప్రజలకు వర్తించే చర్యలను తీసుకొనే అధికారం ఈ సెక్షన్ కల్పిస్తుంది
- ఈ సెక్షన్ కింద తీసుకున్న చర్యలను, నియంత్రణలను ఎవరైనా పాటించకపోతే సెక్షన్ 3 కింద వారు నేరానికి పాల్పడినట్లే. ఐపీసీలోని సెక్షన్ 188 కింద వారు శిక్షార్హులు.