భారత్ అధికారులను యమయాతన పెట్టిన పాక్! కళ్లకు గంతలు కట్టి...
ABN , First Publish Date - 2020-06-16T15:52:17+05:30 IST
పాక్‌లో కొంతసేపు ఆచూకీ లేకుండా పోయిన భారత్ హై కమిషన్ అధికారులకు సంబంధించి నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఇస్లామాబాద్: పాక్‌లో కొంతసేపు ఆచూకీ లేకుండా పోయిన భారత్ హై కమిషన్ అధికారులకు సంబంధించి నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాడు కొన్ని గంటల పాటు వారి ఆచూకీ తెలియకపోవడంతో ఇరు దేశాల్లో ఉద్రక్త వాతావరణ నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరు అధికారులను తామే అరెస్టు చేశామన్న పాక్ పోలీసులు.. భారత్ ఒత్తిడికి లొంగి 12 గంటల తరువాత వారిని విడిపెట్టారు. ఆ అధికారులు స్థానికుడిని కారుతో ఢికొని పోరిపోబోతుంటే పట్టుకున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు. నకిలీ కరెన్సీని చలామణీ చేసేందుకు ప్రయత్నించారని కూడా వారిపై అభియోగం మోపారు.
అయితే అసలు విషయం వేరే ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఉదయం హై కమిషన్‌కు కొద్ది దూరంలో ఉన్న ప్రెట్రోల్ బంక్ వద్ద ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఆయుధాలు ధరించిన 15 మంది సభ్యులు ఆరు వాహనాల్లో అక్కడికి చేరుకుని ఇద్దరు అధికారులను నిర్భంధించారు. కళ్లకు గంతలు కట్టి.. వాహనంలో పడేశారు. 10 నిమిషాల తరువాత వారిని ఓ గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తరువాత అక్కడ ఆరు గంటల పాటు ఇంటరాగేషన్ పేరిట యాతన పెట్టారు. ఇనుప, చెక్క కర్రలతో పాక్ వ్యక్తులు వారిని కొట్టినట్టు కూడా తెలుస్తోంది. హై కమిషన్‌లో ఎవరెవరున్నారు వారి విధులేమిటో చెప్పాలంటూ ఇద్దరు అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది.
పాక్ మీడియాలో మాత్రం యాక్సిండెంట్ కేసులోనే వారిని అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇది వాస్తవం కాదని ఇద్దరు బాధితులు జాతీయ మీడియాకు తెలిపారు. చేయని తప్పును ఒప్పుకోవాలాంటూ తమను యాతన పెట్టారని వారు వాపోయారు. ఇతర భారతీయ అధికారులతోనూ భవిష్యత్తులో ఇలాగే ప్రవర్తించాల్సి వస్తుందంటూ హెచ్చరించి పంపారని వారన్నారు.
అధికారులు అదృశ్యమవడంతో భారత్‌లో పెద్ద ఆందోళన చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన భారత్..పాక్‌పై తీవ్ర ఒత్తడి తేవడంతో సోమవారం రాత్రి 9 గంటలకు పాక్ అధికారులు వారిని విడిచిపెట్టారు. ఇద్దరు అధికారుల మెడ, తొడ, ముఖంపై గాయాలున్నాయని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.