రైతుల డిమాండ్లు అంగీకరించాల్సిందే
ABN , First Publish Date - 2020-12-10T07:17:22+05:30 IST
కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలని అన్నదాతలు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేలా చొరవ తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రతిపక్ష

రాష్ట్రపతికి ప్రతిపక్ష నేతల వినతి
కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలని అన్నదాతలు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేలా చొరవ తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారంనాడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎంకే నేత ఇళంగోవన్ రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందించారు.
ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలతో సహా మొత్తం 20కి పైగా రాజకీయ పార్టీలకు రైతులకు మద్ధతును ప్రకటించాయని, భారత్ బంద్‌కు కూడా మద్ధతిచ్చాయని పేర్కొన్నారు. చర్చ, ఓటింగ్ లేకుండా కొత్త వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో అప్రజాస్వామికంగా ప్రభుత్వం ఆమోదింపజేసుకుందని తెలిపారు. ఈ చట్టాలు భారత ఆహార భద్రతకు ముప్పు తెచ్చేలా ఉన్నాయని, వ్యవసాయ రంగాన్ని, రైతులను నాశనం చేసేలా ఉన్నాయని వివరించారు. దేశ వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ మార్కెట్లను కార్పొరేట్లకు తాకట్టు పెట్టించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని ప్రధాన మంత్రి... ఆయన స్నేహితులకు అప్పగించాలన్న లక్ష్యంతో చట్టాలు చేశారని రాహుల్ ఆ తరువాత దుమ్మెత్తారు.