మహా ముప్పు!

ABN , First Publish Date - 2020-04-24T07:17:43+05:30 IST

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి నిలువెల్లా వణికిస్తోంది. వైరస్‌ కేసుల సంఖ్య ఎక్కడా తగ్గడం లేదు. దేశంలో ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్రవే సింహభాగం

మహా ముప్పు!

మహారాష్ట్రలో ఒక్క రోజే 778 నమోదు

భోపాల్‌లో 34 మంది పోలీసులకు వైరస్‌

వారి కుటుంబ సభ్యులు 30 మందికి కూడా

తబ్లీగీల విచారణకు వెళ్లడమే కారణం

20% కోలుకుంటున్నారన్న ఆరోగ్య శాఖ

ఏఎంయూ ఆస్పత్రిలో సర్జన్‌కు కరోనా 

కర్ణాటకలో లాక్‌డౌన్‌ పాక్షిక సడలింపు

ఏపీలో ఒక్కరోజే 80 కేసులు నమోదు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే రికార్డు


న్యూఢిల్లీ/భోపాల్‌/ముంబై,ఏప్రిల్‌ 23: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి నిలువెల్లా వణికిస్తోంది. వైరస్‌ కేసుల సంఖ్య ఎక్కడా తగ్గడం లేదు. దేశంలో ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్రవే సింహభాగం ఉంటున్నాయి. గురువారం దేశవ్యాప్తంగా 1,229 కొత్త కేసులు నమోదయితే.. వాటిలో 778 కేసులు మహారాష్ట్రలోనే బయటపడ్డాయి. ఇందులో ఒక్క ముంబైలోనే 478 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసులు ముంబైలో 4,232కు, రాష్ట్రంలో 6,427కు పెరిగాయి. ముంబైలోని ధారావిలో మరో 25 మందికి వైరస్‌ సోకడంతో ఆ ప్రాంతంలో కేసుల సంఖ్య 214 చేరింది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా వైరస్‌ కేసులు 21,700కు పెరిగాయి. మరణాల సంఖ్య 686కు చేరింది. గురువారం కొత్తగా 1,229 కేసులు, 34 మరణాలు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 34 మంది పోలీసు సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. వీరిలో కానిస్టేబుల్‌ నుంచి ఉన్నతాధికారుల వరకు ఉన్నారు. గత నెల తబ్లీగీ జమాత్‌కు హాజరై భోపాల్‌ తిరిగొచ్చిన వ్యక్తుల కోసం గాలిస్తున్నప్పడు మొదట కొందరు పోలీసులు కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత మరికొందరికి సోకింది. తాజాగా గురువారం సైబర్‌ విభాగంలో పనిచేసే ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 34కు చేరింది. వీరి కుటుంబ సభ్యులు 30 మందికి కూడా కరోనా సోకింది. వైరస్‌ మరింత వ్యాపించకుండా చూసేందుకు, తమ కుటుంబ సభ్యుల క్షేమం కోసం దాదాపు 2,100 మంది పోలీసు సిబ్బంది విధులు ముగిశాక ఇంటికి వెళ్లడం లేదు. వారికి హోటళ్లలో బస ఏర్పాటు చేసి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. పీపీఈ కిట్లు, శానిటైజర్లు అందజేశారు.


ఢిల్లీలో ఒకే కుటుంబంలోని 11 మందికి కరోనా సోకింది. వీరిలో రెండు నెలల పసికందు, ఆరేళ్ల బాలుడు ఉన్నారు. జమా మసీదు సమీపంలోని జన సాంద్రత ఎక్కువగా ఉండే చుడీవాలా ప్రాంతంలో ఈ కుటుంబం నివసిస్తోంది. కర్ణాటకలో మరో 18 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. వీరిలో బెంగళూరులో ఉంటున్న 10 మంది బిహార్‌ వలస కార్మికులు ఉన్నారు. తమిళనాడులో గురువారం 54 మందికి పాజిటివ్‌ నిర్థారణ కాగా, వాటిలో సగం చెన్నైలోనే ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,683కి చేరగా, చెన్నైలో 400కు పెరిగింది. పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జయమూర్తి వైద్యుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. 


20% రోగులు కోలుకొన్నారు: కేంద్రం

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,257 మంది కరోనా రోగులు కోలుకొన్నారని, ఇది దాదాపు 20 శాతమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలోని 12 జిల్లాల్లో గత 28 రోజులుగా, 73 జిల్లాల్లో 14 రోజులుగా కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. కరోనా వ్యాప్తిని కనిష్ఠ స్థాయికి పరిమితం చేయగలిగామని, కేసులు రెట్టింపు అయ్యే సమయాన్ని పెంచగలిగామని సాధికార బృందం-2 చైర్మన్‌ సి.కె.మిశ్రా తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా మార్చి 23 నాటికి దాదాపు 15 వేల ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాం. ఏప్రిల్‌ 22 నాటికి 5 లక్షల పరీక్షలు చేశాం. 30 రోజుల్లో 33 రెట్లు పెంచాం’’ అని వివరించారు. 


ఏఎంయూ ఆస్పత్రి సర్జన్‌కు కరోనా 

అలీగఢ్‌: యూపీలోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) అనుబంధ జవహర్‌లాల్‌ నెహ్రూ వైద్య కళాశాలలో ఒక సర్జన్‌కు కరోనా వైరస్‌ సోకింది. దీంతో 20 మంది వైద్యులు, వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు పంపారు. ఆ సర్జన్‌కు ఐసొలేషన్‌ వార్డుతో సంబంధం లేదు. మూడు రోజుల కిందట ఓ రోగికి ఆయన శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ సమయంలో వైరస్‌ సోకిందని భావిస్తున్నారు. ఆ రోగికి లక్షణాలు కనిపించకుండా కరోనా ఉందని అనుమానిస్తున్నారు.

  

కర్ణాటకలో లాక్‌డౌన్‌ పాక్షిక సడలింపు

బెంగళూరు: కర్ణాటకలో లాక్‌డౌన్‌ నిబంధనలను పాక్షికంగా సడలించారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలను కనీస సిబ్బందితో కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొన్ని నిర్మాణ కార్యకలాపాలు, ప్యాకేజీ సామ గ్రి తయారీ, కొరియర్‌ సేవల కూ పచ్చజెండా ఊపింది.


తండ్రి కడచూపు కోసం వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం

గ్రేటర్‌ నొయిడా: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆశిష్‌ ఖరే జమ్ములో కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 18న అతని తండ్రి కన్నుమూశారు. ఖరే తన స్వస్థలం లఖింపూర్‌ ఖేరీ వెళ్లేందుకు యూపీ ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేశాడు. యూపీ అధికారులు జమ్ము యంత్రాంగంతో మాట్లాడి అతని కోసం వాహనం, 4 రాష్ట్రాలు దాటేందుకు పాస్‌ జారీ చేయించారు. దాంతో ఆశిష్‌ వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. 

Updated Date - 2020-04-24T07:17:43+05:30 IST