చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే

ABN , First Publish Date - 2020-10-31T07:47:49+05:30 IST

చెరువులు, కుంటలు, నదులు, ఇతర నీటి కాలువలను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (

చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే

ఆక్రమణలు లేకుండా చూడాలి 

అనుమతిచ్చినవారిపై చర్యలు తీసుకోవాలి

సంగారెడ్డి  కలెక్టర్‌ కమిటీకి ఎన్జీటీ ఆదేశాలు

తెల్లాపూర్‌లో 3 చెరువులు, 12 కి.మీ.  కాలువల ఆక్రమణలపై తీర్పు

న్యూఢిల్లీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): చెరువులు, కుంటలు, నదులు, ఇతర నీటి కాలువలను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. అలాంటి ప్రాంతాల్లో ఆక్రమణలను అరికట్టాలని తేల్చిచెప్పింది. హైదరాబాద్‌ శివారు తెల్లాపూర్‌ గ్రామ పరిధిలో ఉన్న వనం చెరువు, మెడ్ల చెరువు, చెలికుంటతో పాటు 12 కిలోమీటర్ల మేర నీటి కాలువలు, నాలాలను కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాయంటూ మానవ హక్కులు, వినియోగదారుల రక్షణ సెల్‌ ట్రస్టు చైర్మన్‌ ఠాకూర్‌ రాజ్‌కుమార్‌ సింగ్‌ ఎన్జీటీలో పిటిషన్‌ వేశారు.


ఎన్జీటీ న్యాయసభ్యుడు జస్టిస్‌ కే రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు సైబల్‌ దాస్‌ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దానిని విచారించి తుది తీర్పు వెలువరించింది. ఆక్రమణదారులను, ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు జారీ చేసిన వారిని గుర్తించడానికి గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌తో తెలంగాణ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాము కేసు వివరాల్లోకి వెళ్లడంలేదని ఎన్జీటీ తెలిపింది.


అయితే, ఆ కమిటీకి ఎన్జీటీకి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆక్రమణల ద్వారా పర్యావరణానికి హాని జరిగితే ఎంతమేర పర్యావరణ పరిహారాన్ని వసూలు చేయాలో అంచనా వేయాలని, అనుమతుల్లేకుండా బోరుబావులు తవ్వితే వాటికి కూడా జరిమానా విధించాలని స్పష్టం చేసింది. ఆ చెరువులకు సంబంధించి సరిగ్గా సర్వే  జరిపి ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ను ఖరారు చేయాలని, వాటిలోపల ఉండే ఆక్రమణలను తొలగించాలని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఆక్రమణలు లేకుండా చెరువులను పరిరక్షించడానికి కార్యాచరణ రూపొందించాలని పేర్కొంది. తమ ఆదేశాలను అమలు చేయడంలో పురోగతిపై 3 నెలలకు ఒకసారి కమిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.


కాగా, సుస్థిర అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి పేరిట పర్యావరణం కోణంలో ఆలోచించకుండా ఆక్రమించిన భూముల్లో నిర్మాణాలకు అనుమతించడం వల్ల వర్షాలు పడినప్పుడు భారీ వరదలు వస్తున్నాయని ఎన్జీటీ ప్రస్తావించింది. ఇటీవల తెలంగాణలో వచ్చిన వరదలకు భూములను ఆక్రమించడమే కారణమని పేర్కొంది.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి, భవనాల నిర్మాణానికి అనుమతులు ఇస్తే... అలాంటి ఉత్తర్వులను వెనక్కితీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కమిటీని ఆదేశించింది. ఇలా అక్రమంగా అనుమతులు ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వ్యవసాయానికి పనికి రాదన్న నిర్ణయానికి వచ్చినప్పుడే భూమార్పిడికి అనుమతించాలని పేర్కొంది. 


Read more