ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నవారికి కరోనా వైరస్ పరీక్ష చేయండి : ఐసీఎంఆర్

ABN , First Publish Date - 2020-03-21T20:35:46+05:30 IST

కరోనా వైరస్ నిర్థరణ పరీక్షల మార్గదర్శకాలను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శనివారం సవరించింది. నూతన మార్గదర్శకాల ప్రకారం...

ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నవారికి కరోనా వైరస్ పరీక్ష చేయండి : ఐసీఎంఆర్

న్యూఢిల్లీ : కరోనా వైరస్ నిర్థరణ పరీక్షల మార్గదర్శకాలను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శనివారం సవరించింది. నూతన మార్గదర్శకాల ప్రకారం తీవ్రమైన శ్వాస సంబంధ అస్వస్థత, ఊపిరి తీసుకోవడం, వదలడంలో ఇబ్బందులు, జ్వరం, దగ్గుతో బాధపడుతూ, ఆసుపత్రిలో చేరిన అందరు రోగులకు కరోనా వైరస్ (కోవిడ్-19) నిర్థరణ పరీక్షలు నిర్వహించాలి. రాన్రానూ ఈ వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఇన్ఫెక్షన్ మరింత విస్తరించకుండా సమగ్రంగా నియంత్రించడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలను రూపొందించింది. 


కోవిడ్-19 సోకినట్లు నిర్థరణ అయిన వ్యక్తి అటువంటి లక్షణాలను ప్రదర్శించకుండా నేరుగా, అత్యధిక హానికరంగా ఎవరినైనా కలుసుకున్నపుడు, ఆ విధంగా కలిసినవారిని, వారు కలిసినప్పటి నుంచి 5వ రోజు, 14వ రోజు మధ్యలో ఒకసారి పరీక్షించాలని నూతన మార్గదర్శకాలు చెప్తున్నాయి. 


కోవిడ్-19 పరీక్షల్లో సమ్మిళిత విధానానికి అనుగుణంా అందరికీ నమ్మదగిన రోగ నిర్థరణ పరీక్షలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ సవరణ జరిగింది.


ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 కేసులు విదేశీ ప్రయాణాలు, లోకల్ ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించినవని ఐసీఎంఆర్ తెలిపింది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కేసులు నమోదు చేయలేదని, ఒకవేళ ఈ కేసులు వెల్లడైతే అందుకు అనుగుణమైన పరీక్షల వ్యూహాన్ని రూపొందిస్తామని ప్రకటించింది. పరీక్షల సలహాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొంది. 


నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే పౌల్ అధ్యక్షతన ఏర్పాటైన జాతీయ టాస్క్ ఫోర్స్ ఈ పరీక్షల వ్యూహాన్ని సమీక్షిస్తోందని తెలిపింది.


Updated Date - 2020-03-21T20:35:46+05:30 IST