ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు
ABN , First Publish Date - 2020-11-03T17:04:00+05:30 IST
ఆస్ట్రియాలోని వియన్నాలో కాల్పులు కలకలం రేపాయి. ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు...
వియన్నా: ఆస్ట్రియాలోని వియన్నాలో కాల్పులు కలకలం రేపాయి. ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. భద్రతాదళాల చేతిలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. వియన్నాలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. భారత్‌లోని ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తరహాలో ఏక కాలంలో కాల్పులకు తెగబడాలని ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరుడని ఆస్ట్రియా మంత్రి కార్ల్ నెహ్‌మర్ తెలిపారు. ఊహించని ఈ ఉగ్ర దాడులతో వియన్నా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదిలా ఉంటే.. వియన్నాలో ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో ఆస్ట్రియాకు భారత్ అండగా ఉంటుందని ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని సానుభూతి ప్రకటించారు.