ఉగ్ర దాడి యత్నం భగ్నం
ABN , First Publish Date - 2020-05-29T06:50:56+05:30 IST
పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామా జిల్లాలోని రాజ్‌పొరాలో మరో భారీ ఉగ్రదాడి జరగకుండా అడ్డుకున్నాయి. 400 మంది సైనికులు, కమాండర్లు, సైనికాధికారులను తరలించే 20-25 వాహనాల కాన్వాయ్‌ను...

- పుల్వామా తరహాలో 400 మంది జవాన్ల హత్యకు కుట్ర
- తిప్పికొట్టిన భద్రత దళాలు
శ్రీనగర్, మే 28 : పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామా జిల్లాలోని రాజ్‌పొరాలో మరో భారీ ఉగ్రదాడి జరగకుండా అడ్డుకున్నాయి. 400 మంది సైనికులు, కమాండర్లు, సైనికాధికారులను తరలించే 20-25 వాహనాల కాన్వాయ్‌ను పేలుడు పదార్థాలు నింపిన కారుతో పేల్చేయాలని హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులకు బుధవారం సమాచారం అందింది. దీంతో సైనికులు, పోలీసులు, భద్రతా దళాలు కలిసి రాత్రంతా ఉగ్రవాదుల కారును గాలించి, పట్టుకుని పేల్చివేశారు. భద్రతా బలగాలపై పుల్వామా తరహా ఉగ్రదాడి చేయాలని హిజ్బుల్, జైషే ఉగ్రవాదులు గత వారం రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారని తమకు సమాచారం అందినట్లు ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.
‘‘కారును జనావాసానికి దూరంగా తీసుకెళ్లి, బాంబు నిర్వీర్య బృందం సిబ్బందితో చాకచక్యంగా పేల్చివేయించాం. జనం మధ్యలో కారు పేలి ఉంటే ఆస్తి, ప్రాణనష్టం భారీగా ఉండేది. హిజ్బుల్ ఉగ్రవాది ఆదిల్, పాకిస్థానీ ఉగ్రవాది, జైషే కమాండర్ ఫౌజీ ఈ దాడికి పథక రచన చేసినట్లు అనుమానిస్తున్నాం’’ అని ఐజీ వెల్లడించారు.