1 నుంచి టెన్త్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-13T12:33:18+05:30 IST

కొవిడ్‌ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలోనే... పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప

1 నుంచి టెన్త్‌ పరీక్షలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలోనే... పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జూన్‌ 1న ప్రారంభ మవుతాయని పాఠశాల విద్యాశాఖ మంత్రి కేఏ సెంగోటయ్యన్‌ ప్రకటించారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జూన్‌ ఒకటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. అదే విధంగా  మార్చి 26న జరిగిన ప్లస్‌-1 పరీక్షకు హాజరుకాలేని విద్యార్థులకు జూన్‌ 2వ తేదీ మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామని, పెండింగ్‌లో ఉన్న మరో ప్లస్‌-1 పరీక్షను జూన్‌ 4న జరుపుతామని వెల్లడించారు. మార్చి 24న రవాణా సదుపాయం లేకపోవడం వల్ల ప్లస్‌-2 పరీక్షకు 34,842 మంది హాజరుకాలేకపో యారని, వారి కోసం కూడా మళ్ళీ జూన్‌ 4న ఆ పరీక్షను నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ప్లస్‌-2 జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందని, పబ్లిక్‌ పరీక్షలు రాయనున్న అభ్యర్థులందరికీ కరోనా వైరస్‌ నిరోధక నిబంధనల ప్రకారం అన్ని రకాల ఆరోగ్య సదు పాయాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులంతా భౌతిక దూరం పాటించే లా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలు ఎప్పుడు తెరిచేదీ తర్వాత ప్రకటిస్తామని, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించడమే చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులను చెల్లించాలం టూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారని పాత్రికేయులు మంత్రి దృష్టికి తీసుకురాగా దీనిపై ఆయన స్పందిస్తూ మెట్రిక్‌ పాఠశాలలన్నింటికీ విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోందని, సుమారు రూ.218 కోట్లను నేరుగా బ్యాంక్‌లో జమ చేస్తోందని చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థలు తలిదండ్రులను ఫీజు చెల్లిం చాలని వేధించకూడదని, దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో నీట్‌కు శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే రెండు వేలమంది ఉపాఽధ్యాయులకు ముందుగా రెండు వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. వచ్చే నెలలో ఆసక్తి కలిగిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పది కళాశాలల్లో నీట్‌ కు శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఆ శిక్షణకు హాజరయ్యే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వసతి, ఆహార సదుపాయాలు కూడా కల్పించనున్నామని మంత్రి వివరించారు. 


వాయిదా వేయండి : స్టాలిన్‌ డిమాండ్‌

కరోనా ఉధృతి అధికంగా ఉన్న తరుణంలో, ఇంకా లాక్‌డౌన్‌ ముగింపుపై ప్రకటన వెలువడక మునుపే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనుకోవడం సముచిత నిర్ణయం కాదని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. పరీక్షలు నిర్వహించే ముందు కరోనా ప్రభావం నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బయటపడే అవకాశం ఇవ్వాలని, ప్రస్తుతం పరీక్షలను వాయిదా వేయాలని స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. 


టైమ్‌ టేబుల్‌

జూన్‌ 1 సోమవారం తమిళం

జూన్‌ 3 బుధవారం ఆంగ్లం

జూన్‌ 5 శుక్రవారం గణితం

జూన్‌ 6 శనివారం ఐచ్చిక భాష

జూన్‌ 8 సోమవారం సైన్స్‌

జూన్‌ 10 బుధవారం సాంఘిక శాస్త్రం

జూన్‌ 12 శుక్రవారం ఒకేషనల్‌

Read more