రజినీకి ఏమైంది.. ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ..!?

ABN , First Publish Date - 2020-12-26T16:16:50+05:30 IST

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారన్న

రజినీకి ఏమైంది.. ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ..!?

చెన్నై : సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారన్న వార్త రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అదే సమయంలో ఆయన రాజకీయ పార్టీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో బెంగ మొదలైంది. ‘తలైవర్‌’ తక్షణం కోలుకుని రావాలని, వెంటనే పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయాలని ఆయన అభిమానులు, రజినీ మక్కల్‌ మండ్రం కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఒకవేళ రజినీ కోలుకోవడానికి సమయం పడితే పార్టీ ఏర్పాటు వ్యవహారంలో జాప్యం ఏర్పడవచ్చని వస్తున్న వార్తలు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఈ నెల 31న పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తానని ఇప్పటికే రజినీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఎంజీఆర్‌ జయంతి రోజున ఆయన పార్టీ పేరు ప్రకటించవచ్చన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.


అయితే ఈ లోపే ‘అన్నాత్తే’ షూటింగ్‌ ముగించాలన్న ఆలోచనతో రజినీ బృందం ఇటీవల హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడ షూటింగ్‌ జరుగుతుండగానే ఎనిమిదిమందికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అర్ధాంతరంగా ప్యాకప్‌ చెప్పారు. ఆ వెంటనే రజినీ చెన్నై బయలుదేరారంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆయన హైదరాబాద్‌లోనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారని చిత్ర యూనిట్‌ పేర్కొంది. అంతేగాక రజినీకి నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌ అని తేలిందని కూడా స్పష్టత ఇచ్చింది. దీంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో శుక్రవారం రజినీ ఆస్పత్రిలో చేరారంటూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి ప్రకటించడం అభిమానులను కలవరపరచింది. అయితే ఆయనకు కేవలం రక్తపోటు అధికంగా ఉందని, ఎలాంటి కరోనా లక్షణాలు లేవనే  ప్రకటన వారికి కొంత ఊరటనిచ్చింది.


ఇప్పుడేం జరుగుతుందో?

రజినీ ఆస్పత్రిలో ఎన్నాళ్లు ఉండాల్సి వస్తుందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో, మరీ ముఖ్యంగా ‘రజినీ మక్కల్‌ మండ్రం’ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 31వ తేదీన పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేస్తానని రజినీ ప్రకటించారు.  ఈ లోగా తలైవర్‌ కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిందేనని వైద్యులు చెబితే.. అప్పుడు పరిస్థితి ఏమిటన్న దానిపై మండ్రం కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అదే జరిగితే ఇప్పటికే రాజకీయ ప్రకటనపె ప్రత్యర్థి వర్గాలు చేస్తున్న దుష్ప్రచారం నిజమవుతుందేమోననే ఆందోళన మండ్రం నేతల్లో కనిపిస్తోంది. రాజకీయ ప్రవేశంపై ‘అదిగో.. ఇదిగో’ అంటూ కాలం గడిపిన రజినీ.. ఇప్పుడు కూడా రాబోరని ఇప్పటికే వైరివర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు తలైవర్‌ ప్రకటనలో జాప్యం జరిగితే వర్గాల విమర్శలకు మరింత ఊతం ఇచ్చినట్లవుతుందని, సాధ్యమైనంత త్వరగా రజినీ కోలుకుని బయటకు రావాలని మండ్రం కార్యకర్తలు ప్రార్థనలు జరుపుతున్నారు.


60 శాతం బూత్‌ కమిటీల ఏర్పాటు

రాజకీయ ప్రకటన తేదీ సమీపించే కొద్దీ ‘రజినీ మక్కల్‌ మండ్రం’ బూత్‌ కమిటీల ఏర్పాటు ముమ్మరంగా సాగుతోంది. గతంలో రజినీ నిర్దేశించిన మేరకు మండ్రం జిల్లా కార్యదర్శులు యుద్ధప్రాతిపదికన బూత్‌ కమిటీల ఏర్పాట్లలో నిమగ్నమైనారు. ఈ కమిటీ ఏర్పాటుపై 25వ తేదీ లోపు వివరాలు పంపాలని ఇప్పటికే మండ్రం నిర్వాహకులకు ఆదేశాలందాయి. అయితే ఇందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో కమిటీలో 15మంది కార్యకర్తలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రజినీ పార్టీ పట్ల మహిళలు, యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రచారం చేపట్టనున్నారు.


తలైవర్‌ ఆరోగ్యంపై ఆరా..

రజినీ ఆస్పత్రి పాలయ్యారనే వార్త వెలువడగానే ఆయన ఆరోగ్యం ఎలా ఉందోనంటూ కోలీవుడ్‌ మొత్తం ఆందోళన చెందింది. అయితే కేవలం రక్తపోటు కారణంగానే ఆయన ఆస్పత్రిలో చేరారని, ఇతర సమస్యలేవీ లేవని వైద్య వర్గాలు చెప్పడంతో కొంత ఊరట చెందింది. అయితే కరోనా కల్లోలంలో పరిశ్రమ పెద్దాయన ఆస్పత్రి పాలవడం పట్ల సినీ ప్రముఖులంతా ఆందోళన చెందుతున్నారు. తలైవర్‌కు ఏమీ కాకూడదని వారు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటూ హైదరాబాద్‌కు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు.

Updated Date - 2020-12-26T16:16:50+05:30 IST