లవ్ జిహాద్ కేసుల్లో నిందితులకు పదేళ్ల జైలు

ABN , First Publish Date - 2020-11-26T13:00:42+05:30 IST

లవ్ జిహాద్ కేసుల్లో నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా .....

లవ్ జిహాద్ కేసుల్లో నిందితులకు పదేళ్ల జైలు

పురోహితుడికి జరిమానా...మధ్యప్రదేశ్ సర్కారు ముసాయిదా చట్టం 

భోపాల్ (మధ్యప్రదేశ్): లవ్ జిహాద్ కేసుల్లో నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా మధ్యప్రదేశ్ రాష్ట్రం కొత్త ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ముస్లిమ్ యువకులు హిందూ యువతులకు ప్రేమించి వివాహం చేసుకుంటే లవ్ జిహాద్ కింద కేసు నమోదు చేసి వారికి పదేళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని మధ్యప్రదేశ్ సర్కారు తీసుకువచ్చింది. బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ సర్కారు లవ్ జిహాద్ ను అనుమతించమని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. బలవంతంగా మోసం చేసి మతాంతర పెళ్లి చేసుకొని ప్రలోభాల ద్వారా మతమార్పిడిని నిషేధించే ఆర్డినెన్సును యూపీ సర్కారు ఆమోదించిన ఒకరోజు తర్వాత మధ్యప్రదేశ్ సర్కారు కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ కొత్త ముసాయిదా చట్టం ప్రకారం మతాంతర వివాహాలను నియంత్రించవచ్చు. 


లవ్ జిహాద్ కేసులో నిందితులను అరెస్టు చేశాక 45 రోజుల వరకు బెయిల్ పొందలేరని, ఈ కేసుల్లో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారని మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా చెప్పారు. దీనికోసం రూపొందించిన మధ్యప్రదేవ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్ ను డిసెంబరు 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని హోంశాఖ మంత్రి వెల్లడించారు. మతాంతర వివాహాలు చేసే వివిధ మతాల గురువులకు ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించడంతోపాటు మత మార్పిడులను ప్రోత్సహించే సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయనుందని మంత్రి చెప్పారు. 

Updated Date - 2020-11-26T13:00:42+05:30 IST