స్ట్రెయిన్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 7 వరకూ..
ABN , First Publish Date - 2020-12-30T17:12:38+05:30 IST
ప్పటికే యూకే నుంచి వచ్చిన వారిలో 20 మందికి స్ట్రెయిన్‌గా నిర్ధారణ కావడంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఈ సమయంలో ...

యూకే నుంచి రాకపోకలపై నిషేధాన్ని జనవరి 7 వరకూ పొడిగింపు
ఢిల్లీ: బ్రిటన్‌కు విమాన రాకపోకలపై నిషేధాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 23 నుంచి 31 వరకూ విధించిన తాత్కాలిక నిషేధాన్ని 2021 జనవరి 7 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా కేంద్రం ప్రకటన చేసింది. కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వారిలో 20 మందికి స్ట్రెయిన్‌గా నిర్ధారణ కావడంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఈ సమయంలో యూకే నుంచి విమానాలను అనుమతించడం శ్రేయస్కరం కాదని భావించింది. ఇదిలా ఉంటే.. యూకే నుంచి దేశానికి తిరిగివచ్చిన వారిలో మంగళవారం ఆరుగురికి కొత్త కరోనా స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. బుధవారం మరో 14 మందికి యూకే స్ట్రెయిన్ సోకినట్లు కేంద్రం తెలిపింది. దీంతో.. భారత్‌లో మొత్తం స్ట్రెయిన్ కేసుల సంఖ్య 20కి చేరింది. ఈ నెల 22వ తేదీ అర్థరాత్రి వరకు వివిధ విమానాశ్రాయాలకు చేరిన వారిలో పాజిటివ్ వచ్చినవారి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా.. మంగళవారం వరకూ బెంగళూరు నిమ్‌హాన్స్‌లో ముగ్గురికి, హైదరాబాద్ సీసీఎంబీలో ఇద్దరికి, పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌లో ఒకరికి కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు.
వీరందరినీ ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూం ఐసోలేషన్‌లో ఉంచారని, దగ్గరి కాంట్టాకులను క్వారంటైన్ చేశారని కేంద్రం తెలిపింది. సహ ప్రయాణికులు, కుటుంబంలో, కాంటాక్టుల గుర్తింపు కొనసాగుతోందని పేర్కొంది. నవంబరు 25- డిసెంబరు 23 మధ్య యూకే నుంచి 33 వేల మంది దేశానికి తిరిగొచ్చారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం వరకు 114 మందికి పాజిటివ్ వచ్చినట్లు వివరించింది. ఈ నెల 9 నుంచి 22వ తేదీల మధ్య భారత్‌కు చేరిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన అందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపనున్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌లపైనా టీకాలు పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కె.విజయ్ రాఘవన్ స్పష్టం చేశారు.