ముప్పు ముంచుకొస్తున్న రాష్ట్రాల్లో.. తెలంగాణ
ABN , First Publish Date - 2020-07-18T07:13:15+05:30 IST
తెలంగాణ జిల్లాల్లో కరోనా మహమ్మారి తీవ్రరూపు దాల్చొచ్చని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ హెచ్చరించింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో...

రాష్ట్రంలోని జిల్లాలకు కరోనా గండం
మధ్యప్రదేశ్, బిహార్ తర్వాత మూడో స్థానం
ఊతమిస్తున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులు
‘లాన్సెట్’ జర్నల్ అధ్యయన నివేదిక
వైరస్ వ్యాప్తికి ఊతమిస్తున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులు
న్యూఢిల్లీ, జూలై 17 : తెలంగాణ జిల్లాల్లో కరోనా మహమ్మారి తీవ్రరూపు దాల్చొచ్చని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ హెచ్చరించింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా లేనప్పటికీ.. రానున్న రోజుల్లో జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఉధృతమయ్యే సూచనలున్నాయంటూ ‘పాపులేషన్ కౌన్సిల్’ భారత విభాగం శాస్త్రవేత్తలు రూపొందించిన ఓ అధ్యయన నివేదికను లాన్సెట్ ప్రచురించింది. సామాజిక ఆర్థిక స్థితిగతులు, జనాభా, ఇళ్లు- పరిసరాల పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల నియంత్రణ చర్యలు, ఆరోగ్య వ్యవస్థల అప్రమత్తత అనే 5 విభాగాల్లోని 15 సూచికలు ప్రాతిపదికగా అన్ని రాష్ట్రాల్లోని జిల్లాలకు పొంచి ఉన్న వైరస్ ముప్పును అంచనా వేసినట్లు పాపులేషన్ కౌన్సిల్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ ఆచార్య తెలిపారు. ఆ లెక్కల ప్రకారం.. దేశంలోని 30 పెద్ద రాష్ట్రాల్లో తొమ్మిది రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో వైరస్ ముప్పును ఎదుర్కోవాల్సి రావచ్చన్నారు. కరోనా గండం పొంచి ఉన్న రాష్ట్రాలకు సున్నా నుంచి ఒకటి వరకు స్కేలింగ్ ఇవ్వగా.. ఈ జాబితాలో సున్నా స్కేలింగ్‌తో మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో, 0.75 స్కేలింగ్‌తో తెలంగాణ మూడోస్థానంలో నిలిచిందని నివేదికలో ప్రస్తావించారు.
రెండో స్థానంలో బిహార్ నిలువగా.. నాలుగు నుంచి తొమ్మిది వరకు స్థానాల్లో వరుసగా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్ ఉన్నాయి. ఇక కొవిడ్-19 ముప్పు తీవ్రత అతి తక్కువగా ఉన్న జిల్లాలు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు రాజీవ్ ఆచార్య తెలిపారు. కరోనా గండం పొంచి ఉన్న 100 జిల్లాల్లో 33 యూపీలో, 24 బిహార్‌లో, 20 మధ్యప్రదేశ్‌లో ఉన్నాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా పరీక్షలు చేసి కేసులను గుర్తించే ప్రక్రియ జరగడం లేదని, ఫలితంగా రానున్న రోజుల్లో అలా దాగిన కేసులన్నీ బయటపడి.. వైద్య సదుపాయాల కొరతతో భారీ సంఖ్యలో మరణాలు సంభవించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యయనం కోసం తీసుకున్న జిల్లాల సామాజిక, ఆర్థిక స్థితిగతుల గణాంకాలు రెండు నుంచి ఐదేళ్ల కిందటివని.. ఒకవేళ ఆయా జిల్లాల్లో పరిస్థితులు మారి ఉంటే తమ నివేదికలో ప్రస్తావించిన ముప్పు తీవ్రతల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకొని ఉండొచ్చని నివేదికలో స్పష్టంచేశారు. ఈవిషయమై మరింత కచ్చితత్వం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో జిల్లాల స్థితిగతుల సమాచారాన్ని సేకరించి సమీక్షించుకోవాలని సూచించారు. కాగా, ‘పాపులేషన్ కౌన్సిల్’ అనేది అమెరికాకు చెందిన జాన్.డి.రాక్‌ఫెల్లర్-3 స్థాపించిన అధ్యయన సంస్థ.