నితీష్ టార్గెట్‌గా తేజ్ ప్రతాప్ యాగం
ABN , First Publish Date - 2020-04-27T01:02:53+05:30 IST
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు భగవంతుడు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ ..

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు భగవంతుడు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ పాట్నాలో ఆదివారంనాడు యాగం నిర్వహించారు. 'సద్బుద్ధి మహాయాగం' పేరుతో ఈ యాగాన్ని తేజ్ ప్రతాప్ జరిపించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, వలస కార్మికులను తిరిగి బీహార్‌కు రప్పించే విషయంలో నితీష్‌కు సద్బుద్ధి ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్టు తేజ్ ప్రతాప్ తెలిపారు.
'వలస కార్మికులను వెనక్కి రప్పించే విషయంలో నితీష్ స్వార్థంగా, మతిస్థిమితం తప్పిన వాడిలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి స్వార్థపు ఆలోచనల నుంచి ఆయన బయట పడాలి. బీహార్ భాగ్యవిధాతలైన ప్రజలను, పేద కూలీలను వెనక్కి రప్పించాలనే సద్బుద్ధి ఆయనకు భగవంతుడు ప్రసాదించాలి' అని తేజ్ ప్రతాప్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒక్క బీహార్ మినహా అన్ని రాష్ట్రాల వారు తమ విద్యార్థులను, వలస కూలీలను వెనక్కి తెచ్చుకుంటున్నాయని ఆయన ఆ ట్వీట్‌లో తెలిపారు. తేజ్ ప్రతాప్ నిర్వహించిన యాగంలో ఆయనతో పాటు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.