తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న టెకీ కరోనాతో మృతి
ABN , First Publish Date - 2020-08-11T13:45:23+05:30 IST
కరోనాతో మరణించిన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న కుమారుడికి కరోనా సోకి అతను మరణించిన విషాద ఘటన....

భువనేశ్వర్ (ఒడిశా): కరోనాతో మరణించిన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న కుమారుడికి కరోనా సోకి అతను మరణించిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో వెలుగుచూసింది. బెంగళూరు నగరంలో నివాసముంటున్న ఒడిశా వాసి సత్యనారాయణరావు ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా దిగపహండి గ్రామానికి చెందిన సత్యనారాయణరావు తండ్రి శంకర్ రావు కరోనా వైరస్ తో జులై 14వతేదీన మరణించారు. తండ్రి శంకర్ రావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సత్యానారాయణరావు బెంగళూరు నుంచి తన స్వగ్రామానికి వచ్చారు. కరోనాతో మరణించిన తండ్రి శంకర్ రావు అంత్యక్రియల్లో పాల్గొన్న కుమారుడు అనారోగ్యానికి గురవడంతో అతన్ని బెర్హంపూర్ లోని ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి డిశ్జార్జ్ అయిన సత్యనారాయణ బెంగళూరు తిరిగి వెళదామనుకున్నారు.తిరిగి బెంగళూరు వెళ్లేందుకు భువనేశ్వర్ లోని బిజూపట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ మళ్లీ అనారోగ్యానికి గురై మరణించారు.కరోనాతో తండ్రి, కుమారుడు మరణించిన ఘటన కుటుంబసభ్యులను విషాదంలో ముంచెత్తింది.