పిల్లలకు పాఠాలు చెప్పేందుకు చెట్టు ఎక్కిన టీచర్.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2020-04-21T19:03:09+05:30 IST

దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులు తమ ఇంటి నుంచి పాఠాలు నేర్చుకోవడం కోసం విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న

పిల్లలకు పాఠాలు చెప్పేందుకు చెట్టు ఎక్కిన టీచర్.. ఎక్కడంటే..

కోల్‌కతా: దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులు తమ ఇంటి నుంచి పాఠాలు నేర్చుకోవడం కోసం విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కంప్యూటర్ లేదా మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మళ్లీ పాఠశాలలు లేదా కళాశాలలు ప్రారంభం అయ్యే సమయానికి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ లేకపోవడంతో.. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇలా ఇంటర్నెట్ కారణంగా తనకు ఏర్పడిన ఇబ్బందిని ఓ ఉపాయం ద్వారా ఓ టీచర్ పరిష్కరించాడు. 


పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో హిస్టరీ టీచర్‌గా పని చేసే సుబ్రతా పాటి తన స్వగ్రామం అహండాలో సరైన ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో.. ఒక చెట్టునే తన క్లాస్ రూంగా మార్చుకున్నాడు. కోవిడ్-19 కారణంగా ఏర్పడిన సంక్షోభంలో తన కుటుంబానికి సహాయంగా ఉండేందుకు సుబ్రతా పాటి కో‌ల్‌కతా నుంచి తన స్వగ్రామానికి వచ్చాడు. అక్కడ కూడా అతను తన ఉపాధ్యాయ వృత్తిని మాత్రం అతను వదుకోలేదు. గ్రామంలో సరిగ్గా ఇంటర్నెట్ లేకపోవడంతో ఒక వేప చెట్టుపై వెదురు కర్రలు, గోనె సంచులు, తదితర సామాగ్రితో ఓ వేదికను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఇంటర్నెట్ కాస్త మెరుగ్గా వస్తుండటంతో.. విద్యార్థులకు చెట్టుపై నుంచి పాఠాలు చెబుతున్నాడు. 


రోజు ఆహారం, మంచి నీళ్లు తీసుకొని పాటి చెట్టుపైకి వెళ్తాడు. అక్కడ రెండు లేదా మూడు క్లాసులు తీసుకొని కిందకు వస్తాడు. ఎండ, ఈదురుగాలుల కారణంగా చెట్టుపై కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నప్పటకీ.. విద్యార్థులకు ఇబ్బంది కలగవద్దని తాను ఈ పని చేస్తున్నానని అతను చెప్పాడు. 


విద్యార్థులు కూడా తనకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారని అతను పేర్కొన్నాడు. తన కృషికి తగిన ప్రతిఫలంగా తన సబ్జెక్ట్‌లో మంచి మార్కలు తెచ్చుకుంటామని వాళ్లు హామీ ఇచ్చారని అతను పేర్కొన్నాడు. 


పాటి చేసిన ఈ పనిపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. విద్యార్థులకు చదువు చెప్పేందుకు అతను ఇంతటి సాహసం చేయడం నిజంగా అభినందనీయమని పలు విద్యాసంస్థల అధినేత కొనయాడుతున్నారు. పాటిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని వాళ్లు పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-21T19:03:09+05:30 IST