కొత్త చట్టాలు రైతులకు ఉరితాళ్లు

ABN , First Publish Date - 2020-12-28T08:55:29+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ఉరితాళ్లుగా మారతాయని మాజీ మంత్రి, టీడీపీ నేత వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు...

కొత్త చట్టాలు రైతులకు ఉరితాళ్లు

  • మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు 
  • ‘సింఘూ’లో రైతులకు సంఘీభావం 
  • రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత

న్యూఢిల్లీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ఉరితాళ్లుగా మారతాయని మాజీ మంత్రి, టీడీపీ నేత వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. ఆందోళన చేస్తున్న రైతులను ఆయన సింఘూ సరిహద్దు పాయింట్‌ వద్ద శనివారం కలుసుకొని సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, ఏపీ రైతు సంఘాల నేతలు ఉన్నారు. వీరు తొలుత అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ నేత హన్నన్‌ మొల్లాను కలిశారు. ఈ కమిటీతో పాటు భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత దర్శన్‌పాల్‌ సింగ్‌కు చెరి రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షల ఆర్థిక సహకారం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వడ్డే.. వణికిస్తున్న చలిలో రైతులు ఆందోళన చేస్తున్నా కనీసం జాలి, మానవత్వం లేకుండా ఉద్యమాన్ని ప్రధాని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. రైతులు కేవలం వారి కోసం పోరాటం చేయడం లేదని మొత్తం భారత దేశ రైతాంగం కోసం పోరాడుతున్నారని వివరించారు. ఇతరుల సహాయం లేనిదే వంద అడుగులు  వేయలేని స్థితిలో ఉన్న వడ్డే- సింఘూలో సభాస్థలికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. అక్కడ రిక్షా కనపడగానే కొందరు దాన్ని తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టుకొని సభాస్థలికి తీసుకువెళ్లారు. అక్కడి రైతు సంఘాల నేతలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. 


Updated Date - 2020-12-28T08:55:29+05:30 IST