‘ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్’ వ్యవస్థను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-07-08T23:16:03+05:30 IST
‘ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్’ కార్యకలాపాలను రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం

చెన్నై : ‘ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్’ కార్యకలాపాలను రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సిబ్బంది పోలీసు కార్యకలాపాలను నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఇటీవల సతంకుళం పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో తండ్రీకొడుకులు హింసకుగురై, ఆసుపత్రిలో మరణించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
తమిళనాడులోని తూత్తుకూడి, సతంకుళం పోలీస్ స్టేషన్‌లో గత నెల 19న జయరాజ్, బెనిక్స్ తీవ్రంగా హింసకు గురయ్యారని, ఆ తర్వాత ఆ తండ్రీకొడుకులు ఆసుపత్రిలో మరణించారని ఆరోపణలు వచ్చాయి. ఈ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్లకు సహాయంగా ఉండే ‘ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్’ సిబ్బంది ఆరుగురి పాత్రపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిసింది. తండ్రీకొడుకుల కస్టడీ మరణాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు దర్యాప్తు జరిపి, ‘ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్’ వ్యవస్థకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థను నిషేదించింది.
తిరునల్వేలి డీసీపీ అర్జున్ శవరణన్ మాట్లాడుతూ, ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ వాలంటీర్లకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డులను తిరిగి తీసుకోవాలని ప్రభుత్వం అన్ని పోలీస్ స్టేషన్ల ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ వాలంటీర్లను ఇకపై ఎటువంటి పోలీసు సంబంధిత కార్యకలాపాల్లోనూ నియమించరాదని ఆదేశించిందన్నారు.
ప్రజలకు పోలీసులను సన్నిహితం చేసే ఉద్దేశంతో ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ వ్యవస్థను ప్రారంభించారు. ఇది కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం. ఇది 1993లో రామనాథ పురం జిల్లాలో ప్రారంభమైంది. తమిళనాడులో దాదాపు 4,000 మంది ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ సభ్యులు ఉన్నట్లు అంచనా.
ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ వ్యవస్థను రద్దు చేయాలని సామాజిక ఉద్యమకారులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.