చర్చల పేరుతో సాగదీత

ABN , First Publish Date - 2020-12-19T13:29:54+05:30 IST

చర్చల పేరుతో సాగదీత

చర్చల పేరుతో సాగదీత

చెన్నై, (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ కోట్లాదిమంది రైతులు నిర్విరామంగా ఆందోళన చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్చల పేరిట వారిని మోసం చేస్తోందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ధ్వజమెత్తారు. స్థానిక నుంగంబాక్కం వళ్ళువర్‌ కోట్టమ్‌ వద్ద శుక్రవారం ఉదయం డీఎంకే అఖిలపక్ష నాయకుల దీక్షా శిబిరంలో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ నూతన వ్యవసాయ బిల్లులు కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా వుందంటూ మేఽథో వర్గం ఎలుగెత్తి చాటిచెబుతున్నా కేంద్ర ప్రభుత్వంగానీ, ప్రధాని మోదీ గాని ఆ చట్టాలను అమలు చేసి తీరుతామంటూ ప్రకటించ డం గర్హనీయమన్నారు. ఢిల్లీలో 23 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను కించపరిచేలా ఆ ఉద్యమంలో తీవ్రవాదులున్నారంటూ పాలకులు తప్పుడు ఆరోపణలతో ఉద్యమా న్ని పెడతోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్ని స్తోందని విమర్శించారు.కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలను గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసేందు కు ప్రయత్నించిందన్నారు. అన్నదాతలు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టుసడలించకుండా ఉద్యమాన్ని అణచివేయడంపైనే దృష్టిసారిస్తోంద న్నారు.


అన్నదాతలకు మద్దతు గా వ్యవసాయ బిల్లులను రద్దు చేసేంత వరకూ రాష్ట్రంలో డీఎంకే నాయకత్వంలో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని స్టాలిన్‌ హెచ్చరించారు.తాను రైతునంటూ గొప్పలు చెప్పు కుంటున్న ముఖ్యమంత్రి ఎడప్పాడి ఆ రైతుల ఆందోళనకు మద్దతుగా డీఎంకే అఖిలపక్షం శాంతియుతంగా నిరాహార దీక్ష జరుపుకునేందుకు అనుమతివ్వకుండా రైతు వ్యతిరేకిగా రుజువు చేసుకున్నారని స్టాలిన్‌ విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న అన్నదాతల ఆందోళనలో ఇప్పటికే 21 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, ఈ విషయం తెలిసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇసుమంతైనా బాధ గానీ, సంతాపాన్ని గానీ వ్యక్తపరచలేదన్నారు. డీఎంకే పిలుపు మేరకు మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్షకు విచ్చేయడం తనకెంతో ఆనందంగా ఉందని , అన్నదాతలకు డీఎంకే అఖిలపక్షం సమైక్యంగా మద్దతు తెలిపేందుకే నిరాహార దీక్షను చేపట్టామని స్టాలిన్‌ అన్నారు.  దీక్షా శిబిరం వేదికపై స్టాలిన్‌ సహా నాయకులు క్లుప్తంగా ప్రసంగించారు.


ప్రతి నాయకుడు ప్రసంగించిన వెంటనే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. వ్యవసాయ బిల్లులను ఉపసంహ రించుకోవాలంటూ నినాదాలు చేశారు. నిరాహార దీక్షలో పాల్గొన్న నాయకులంతా పచ్చరంగు మాస్కులు, తువ్వాళ్లు ధరిం చారు. నాయకులు కూర్చున్న వేదికకు, కార్యకర్తలకు నడుమ భౌతిక దూరం పాటించేలా ఖాళీ స్థలం ఉంచారు. ఈ కార్యక్రమంలో ఎండీఎంకే నేత వైగో, కాంగ్రెస్‌ ఎం.పి.తిరునావుక్కరసర్‌, సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బాలకృష్ణన్‌, సీసీఐ కార్యదర్శి ముత్తరసన్‌,డీపీఐ నాయకుడు తొల్‌ తిరుమావళవన్‌, మనిదనేయ మక్కల్‌ కట్చి నేత జవాహిరుల్లా, తమిళగ వాళ్వురిమై కట్చి నేత వేల్‌మురుగన్‌, ఐజేకే అధ్యక్షుడు పారివేందర్‌, సీఐటీయూ నేత సౌందరరాజన్‌, ఉళవర్‌ ఉళప్పాలర్‌ కట్చి నేత సెల్వముత్తు, కొంగునాడు మక్కల్‌  కట్చి నేత ఈశ్వరన్‌ తదితర నేతలు ప్రసంగిం చారు. 

Updated Date - 2020-12-19T13:29:54+05:30 IST