ఎన్ కౌంటర్..రౌడీ హతం
ABN , First Publish Date - 2020-08-22T14:41:43+05:30 IST
ఎన్ కౌంటర్..రౌడీ హతం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక అయినావరం ప్రాంతానికి చెందిన పేరుమోసిన రౌడీ శంకర్ (48) ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పోలీసుల బారి నుంచి తప్పించుకు పారిపోయే ప్రయత్నంలో ఆ రౌడీ వేట కొడవలితో దాడి చేయడంతో అయినావరం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ ముబారక్ తీవ్రంగా గాయపడ్డాడు. నగరంలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచ లనం కలిగించింది. ఎన్‌కౌంటర్‌లో హతమైన ‘ఎలనీర్’ శంకర్ మూడు హత్యకేసులు, దారిదోపిడీలు, హత్యా యత్నాలు ఇలా 51 కేసుల్లో నిందితుడు. కొద్ది రోజుల క్రితం అయినావరంలో సూపర్ మార్కెట్ నడుపుతున్న కాంగ్రెస్ ప్రముఖుడు శరవణన్ అలియాస్ సతీష్‌పై గుర్తు తెలియిన వ్యక్తులు వేటకొడవళ్ళతో హత్యాయత్నా నికి పాల్పడ్డారు. ఆ దాడి సంఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రసారమయ్యాయి. దీంతో అయినావరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నటరాజ్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఆ విచారణలో కాంగ్రెస్ నాయకుడిపై రౌడీ శంకర్ అతడి అనుచరులు దాడి చేసినట్టు తెలిసింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని శంకర్ ఆచూకీ కోసం నగరమంతటా జల్లెడ పట్టారు.
శుక్రవారం వేకువజాము రౌడీ శంకర్ నీలాంకరై ప్రాంతంలో దాగి వున్నట్టు సమాచారం అందటంతో పోలీసులు హుటా హుటిన అక్కడికి వెళ్ళి అతడిని అదుపులోకి తీసుకుని అయినవరం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత న్యూ ఆవడిరోడ్డులో మెట్రో వాటర్‌బోర్డు ట్యాంకర్లు ఉండే ప్రాంతంలో గంజాయి దాచినట్టు శంకర్ చెప్పడంతో సీఐ నటరాజ్, హెడ్‌కానిస్టేబుళ్ళు యువరాజ్, ముబారక్‌తో కలిసి అతడిని వెంటబెట్టుకుని ఉదయం 6.30 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రాళ్లురప్పల సమీపంలో గంజాయి కోసం వెదుకు తున్నట్టు నటించిన శంకర్ హఠాత్తుగా భూమిలో దాచి వుంచిన వేట కొడవలి ని బయటకు తీసి పోలీసులపై దాడి చేసి పారిపోయేం దుకు ప్రయత్నించాడు, సీఐ నటరాజ్ లొంగిపొమ్మంటూ తుపాకీ చూపించి హెచ్చరించినా వినిపించుకోలేదు. శంకర్ ముందుకు దూసుకు వచ్చి హెడ్ కానిస్టేబుల్ ముబారక్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ముబారక్ ఎడమ భుజానికి తీవ్రగాయమైంది. దీంతో ఆత్మసంరక్షణ నిమిత్తం సీఐ తుపాకీతో కాల్పులు జరపటంతో రెండు తూటాలు శంకర్ కడుపులోకి దూసుకెళ్ళడంతో కుప్పకూలాడు. ఆ తర్వాత రౌడీ శంకర్‌ను, హెచ్‌సీ ముబారక్‌ను చికిత్స నిమిత్తం కీల్పాక్ వైద్యకళాశాల ఆస్పత్రికి తర లించారు. శంకర్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెంది న ట్టు ప్రకటించారు. ఇక గాయపడిన ముబారక్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ మహేశ్‌కుమార్ అగర్వాల్
ఆస్పత్రికి వెళ్ళి ముబారక్‌ను పరామర్శించారు. ముబారక్ కు అందిస్తున్న వైద్యం కోసం వైద్యులను అడిగి తెలుసు కున్నారు. అదనపు పోలీసు కమిషనర్ దినకరన్, డిప్యూటీ కమిషనర్ సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్ మనోహరన్ తదితర ఉన్నతాధికారులు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతా న్ని పరిశీలించారు. ఆ ప్రాంతం వద్ద పోలీసు పహరా ఏర్పాటు చేశారు.
ఎవరీ శంకర్?
చెన్నై అయినావరంలోని కేకే నగర్ ప్రాంతానికి చెందిన శంకర్ (48) ఇరవై అయిదేళ్ళకు పైగా గంజాయి అమ్ము తూ, దారిదోపిడీలు, హత్యలకు పాల్పడుతుండే వాడు. శంకర్ దాదాగిరి సహించలేని ప్రత్యర్థులు ఓ ముఠా గా ఏర్పడి అతడిపై పలుమార్లు హత్యాయత్నాలు కూడా చేశారు. 2010 నుంచి 2017 వరకు శంకర్ మూడు హత్యలకు, పలు హత్యాయత్నాలకు పాల్పడ్డాడు.2009లో శంకర్ తమ్ముడు హత్యకు గురయ్యాడు. తరవాఆత తన తమ్ముడిని చంపిన ముఠా నాయకుడి తమ్ముడిని శంకర్ హత్య చేశాడు. దీంతో కక్షపెంచుకున్న ప్రత్యర్థి వర్గం 2010లో శంకర్ చిన్నాన్నను హత్య చేసింది. అంతే కాకుండా రౌడీ శంకర్ కేసులు వాదించిన న్యాయ వాది కూడా ప్రత్యర్థివర్గం చేతిలో హతమయ్యారు. ఆ తర్వాత తన తమ్ముడిని హతమార్చిన తిరుముల్లైవాయిల్ ప్రాంతానికి చెందిన రౌడీ ‘యమహా’ బాలాజీని శంకర్ అతడి అనుచరులు కలిపి ఓ కల్యాణ మండపంలో వేట కొడవళ్ళతో దాడిచేసి చంపారు. అప్పటి నుంచి రౌడీ శంకర్ అంటేనే అయినావరం వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. శంకర్‌ను రౌడీలంతా ‘ఎలనీర్’ (‘కొబ్బరి నీళ్ళ’) శంకర్ అని పిలిచేవారు. శంకర్ తల్లి గతంలో అయినావరం ప్రాంతంలో కొబ్బరి బొండాలు విక్రయిం చేది. ఆ కారణంగానే శంకర్‌ను ‘ఎలనీర్’ శంకర్ అని పిలిచేవారు. పోలీసుల రికార్డులకు సంబంధించినంత వరకూ అతడి పేరు అయినావరం రౌడీ శంకర్‌గానే ఉం టోంది. రెండు దశాబ్దాలుగా నగర ప్రజలను గడగడ లాడిం చిన అయినావరం రౌడీ శంకర్ చివరకు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.