రుణాల పేరుతో రూ.3 కోట్ల మోసం
ABN , First Publish Date - 2020-08-20T17:16:04+05:30 IST
రుణాల పేరుతో రూ.3 కోట్ల మోసం

చెన్నై: మహిళా స్వయం సహాయక బృందాల పేరుతో రూ.3 కోట్ల మోసానికి పాల్పడిన గుడియాత్తం కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ మహిళా మేనేజర్‌పై సస్పెన్షన్ వేటుపడింది. గుడియాత్తం కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ శాఖ తరఫున 2018లో మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలు మంజూరు జేశారు. రుణాల పంపిణీలో బ్యాంక్ అధికారులు అవతవకలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదులతో జిల్లా కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎండీ జయం విచారణ జరిపారు. 2018లో మేనేజర్‌గా పనిచేసిన ఉమామహేశ్వరి, కొందరు బ్యాంక్ ఉద్యోగులు కలిసి మహిళా సంఘాలకు రుణాలు అందజేసినట్లు నకిలీ ఆధారాలతో రూ.3 కోట్ల మోసానికి పాల్పడ్డారని తేలింది. దీంతో మేనేజర్ ఉమామహేశ్వరిని సస్పెండ్ చేస్తూ మేనేజింగ్ డైరెక్టర్ జయం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఉమామహేశ్వరి ప్రస్తుతం వేలూరులో ఉన్న కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ (అభివృద్ధి నిర్వాహక పథకం)గా పనిచేస్తున్నారు. కాగా, గుడియాత్తం కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో జరిపిన రుణాల పంపిణీపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఆందోళన చేపట్టనున్నట్లు డీఎంకే కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్ తెలిపారు.