ఇటు మదురై...అటు తిరుచ్చి..

ABN , First Publish Date - 2020-08-20T13:33:22+05:30 IST

ఇటు మదురై...అటు తిరుచ్చి..

ఇటు మదురై...అటు తిరుచ్చి..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రెండో రాజధాని ఏర్పాటుపై సీనియర్‌ మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మరో మంత్రి వెల్లమండి నటరాజన్‌ తిరుచ్చి నగరంలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రకటన చేసి కలకలం సృష్టించారు. కొత్త రాజధానిపై మంత్రులు ఇలా భిన్నస్వరాలు వ్యక్తం చేస్తున్నా ముఖ్య మంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మౌనం వహి స్తుండటం గమనార్హం. మదురైకి చెందిన ఇద్దరు సీనియర్‌ మంత్రులు ఆ నగరంలోనే రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని చేసిన ప్రకటనలు సృష్టించిన అలజడి ఇంకా సద్దుమణగమునుపే మరో మంత్రి తిరుచ్చిలో రాజధాని ఏర్పాటు చేయాలని ప్రకటించి కొత్త వివాదానికి తెరలేపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, కరుణానిధి హాయంలో రెండో రాజధాని ఏర్పాటుపై తీవ్ర ప్రయత్నాలు జరిగాయి.. తిరుచ్చి నగరాన్ని రాజధానిగా చేయాలని ఎంజీఆర్‌ ప్రయత్నించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కరుణానిధి సబర్బన్‌ ప్రాంతంలో శాటిలైట్‌ నగరాన్ని నిర్మించి చెన్నైలోని కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని ప్రయత్నించారు. ఇరువురి ప్రయత్నాలు విఫలమై, ఆ రెండు ప్రతిపాదనలు ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత వల్ల చివరకు బుట్టదాఖలయ్యాయి. అంతటితో సద్దుమణగిన  రాజధాని మార్పు వివాదం చెన్నైలో కరోనా తీవ్రంగా వ్యాపించి, పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరగటంతో మళ్ళీ తెరపైకి వచ్చింది.


గత వారం రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ మదురైలో పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మదురైని రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేయడంతో రాజకీయ అలజడి ప్రారంభమైంది. ఆ తర్వాత మరో సీనియర్‌ మంత్రి సెల్లూరు  రాజు రెవెన్యూ మంత్రి ప్రతిపాదనకు వత్తాసు పలికారు. మదురైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో సెల్లూరు రాజు హాజరై మదురై నగరాన్ని రెండో రాజధానిగా మార్చాలనే ప్రతిపాదన ఈనాటిది కాదని, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ చేసిన ప్రతిపాదన అని సెల్లూరు రాజు వెల్లడించారు. సెల్లూరు రాజు తన ప్రతిపాదనకు మద్దతు ప్రకటించ డంపై హర్షం ప్రకటించిన ఉదయకుమార్‌ మదురైని రెండోరాజధానిగా మార్చేందుకు ముఖ్యమంత్రి ఎడప్పాడి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాజధాని నగరం చెన్నై చుట్టూ అత్యధికంగా పరిశ్రమలున్నాయని, ఇకపై పరిశ్రమలను రాష్ట్ర మంతటా విస్తరింప జేసేందుకు అనువుగా మదురై నగరాన్ని రెండో రాజధానిగా ఏర్పాటు చేయడం మినహా మరో మార్గం లేదని చెప్పారు. రెండో రాజధానిగా మదురై నగరాన్ని మార్చేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి  చొరవ తీసుకుని తక్షణమే ఓ ఉన్నత స్థాయి పరిశీలనా కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి సూచించారు.


తిరుచ్చిలోనే రాజధాని 

ఇది ఇలా ఉండగా బుధవారం చెన్నైలో మీడియా సమావేశంలో పాల్గొన్న మరో మంత్రి వెల్లమండి నటరాజన్‌ రెండో రాజధాని గురించి ప్రస్తావించారు. రెండో రాజధాని ఏర్పాటుకు తిరుచ్చి నగరం అన్ని విధాలా అనుకూలంగా ఉందని, అన్ని మౌలిక సదుపాయాలున్నాయని చెప్పారు. తిరుచ్చి నగరాన్ని రాజధానిగా చేయాలన్నది ఎంజీఆర్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు అని, ఆ కలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉందని ప్రకటించారు.


ఎడప్పాడి నిర్ణయిస్తారు 

రెండో రాజధాని ఏర్పాటుపై ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయం తీసుకుంటారని తమిళాభివృద్ది, పరిశోధన శాఖ మంత్రి మాఫోయ్‌ పాండ్యరాజన్‌ పేర్కొన్నారు. కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌లో అన్నా డీఎంకే జిల్లా కార్యదర్శి, వినియోగదారుల ఫోరం ఛైర్మన్‌ ఆర్‌ఎస్‌ రాజేష్‌ అధ్యక్షతన బుధవారం 500 మంది పేదలకు ఐదు కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు రెండో రాజధాని విషయం ప్రస్తావించగా,  ఈ విషయం లో ముఖ్యమంత్రి   తీసుకొనే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, ప్రస్తుతం మంత్రులంతా కరోనా నివారణ పనుల్లో తలమునకలయ్యారని, ప్రస్తుతం కరోనా బారి నుండి ప్రజలను కాపాడటమే తమ లక్ష్యమని అన్నారు.


మౌనమేలనో..? 

రెండో రాజధానిపై నలుగురు మంత్రులు నాలుగు రకాల అభిప్రా యాలు వ్యక్తం చేస్తున్నా అన్నా డీఎంకే ఉప సమన్వయకర్త, ముఖ్య మంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం సుదీర్ఘ మౌనం పాటిస్తున్నారు. ఇటీవల కాబోయే ముఖ్య మంత్రి ఎవరనే విషయమై ఇదే రీతిలో మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు వారు  రంగంలోకి దిగి ఇకపై కాబోయే ముఖ్య మంత్రి ఎవరనే విషయంపై మంత్రులెవరూ ఏ విధమైన అభిప్రాయాలు వెల్లడించకూడదంటూ సంయుక్త ప్రకటన జారీ చేసి కట్టడి చేశారు. ప్రస్తుతం రెండో రాజధాని విషయంలో మంత్రుల వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా వారిని అదుపు చేయకుండా ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం మౌనం పాటించడం వెనుక ఆంతర్యమేమిటో తెలియడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇరువురూ రెండో రాజధాని ఏర్పాటుకు సానుకూలంగా వున్నారో ప్రతికూలంగా ఉన్నారో ఇతమిత్థంగా తెలియడం లేదు.

Read more