ఓపిక పట్టండి..మేమే పంపుతాం

ABN , First Publish Date - 2020-05-17T13:36:11+05:30 IST

రాష్ట్రంలోని వలస కార్మికులు కాలినడకన, ఇతర వాహనాల్లో స్వస్థలాలకు వెళ్లరాదని, ఓపిక పట్టాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విజ్ఞప్తి చేశారు.

ఓపిక పట్టండి..మేమే పంపుతాం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వలస కార్మికులు కాలినడకన, ఇతర వాహనాల్లో స్వస్థలాలకు వెళ్లరాదని, ఓపిక పట్టాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. వలస కార్మికుల దుస్థితిపై హైకోర్టు న్యాయమూర్తులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలోని వలస కార్మికులంతా వారికి కేటాయించిన శిబిరాల్లోనే నివసించాలని కోరారు.   వీలును బట్టి వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ప్రతిరోజూ పదివేల మంది వలస కార్మికులను స్వస్థలాలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈనెల 5 నుంచి 15 వరకు 55,673 మంది వలస కార్మికులను స్వరాష్ట్రాలకు పంపినట్టు తెలిపారు. 43 రైళ్ల ద్వారా బిహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చేర్చినట్టు తెలిపారు. ప్రతి రోజూ పదివేలమంది వలస కార్మికులను రైళ్లలో స్వస్థలాలకు పంపుతున్నామని, రైలు చార్జీలు సహా ప్రయాణానికి అయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. 


క్షురకులకు రూ.2వేలు

రాష్ట్ర క్షురకుల సంక్షేమ సంఘంలో సభ్యులుగా లేని క్షురకులకు కూడా రూ.2 వేల నగదును పంపిణీ చేయనున్నట్టు  ఎడప్పాడి తెలిపారు. రాష్ట్రంలో మూడు విడతల లాక్‌డౌన్‌ కారణంగా సెలూన్లను మూసివేయడంతో క్షురకులంతా సంపాదన కోల్పోయారని, వారికి రేషన్‌ సరకులను ప్రభుత్వం ఉచితంగా అందజేసిందన్నారు. సంఘంలో సభ్యులుగాలేని తమకూ ఆర్థిక సాయం అందించాలని క్షురకులు కోరడంతో వారికి కూడా రూ.2వేలను ఇవ్వాలని నిర్ణయించినట్లు ఎడప్పాడి తెలిపారు. ఆ మేరకు సంఘంలో సభ్యులుగా లేని క్షురకులందరూ వారి ప్రాంతాల్లో వీఏఓ, నగర పంచాయతీ అధికారులు, మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ జోనల్‌ ఆఫీసర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. వాటిని  పరిశీలించిన మీదట వాటిని ఆయా జిల్లా కలెక్టర్లు పంపి, నగదు సాయం పంపిణీ చేస్తారని ఎడప్పాడి వివరించారు.


Updated Date - 2020-05-17T13:36:11+05:30 IST