కూటమిలో కలకలం

ABN , First Publish Date - 2020-12-19T14:00:12+05:30 IST

కూటమిలో కలకలం

కూటమిలో కలకలం

డిప్యూటీ సీఎం కోసం పీఎంకే పట్టు


చెన్నై, (ఆంధ్రజ్యోతి) : అధికార అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే ఈ సారి అధిక సీట్లను కేటాయించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పదవి కూడా తమకు ఇవ్వాలంటూ పట్టు బిగుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు మిత్రపక్షాలతో ఎన్నికల పొతులు ఖరారు చేసుకునే దిశగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే లకు బలమైన కూటములు న్నాయి. ఓ వైపు ఉలగనాయగన్‌ కమల్‌హాసన్‌ నాయకత్వం లోని మక్కల్‌ నీదిమయ్యం,  జనవరిలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌  కొత్త పార్టీ ప్రారంభించి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు పార్టీల వల్ల అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల ఓటు బ్యాంకు తగ్గే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఏడాదిన్నర క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల అభ్యర్థుల మధ్య గెలుపోటముల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌, రజనీ పార్టీలు తమ పార్టీల ఓట్లను చీల్చే అవకాశం ఉందని, దీనికి తోడు కొత్త ఓటర్లుగా నమోదైన లక్షలాదిమంది యువతీ యువకులు రజనీ పార్టీ, కమల్‌ పార్టీలకు మద్దతుగా ఓటు వేస్తారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే అన్నాడీఎంకే తన కూటమిలోని మిత్రపక్షాలు మరో కూటమిలోకి చేరకుండా తగు చర్యలు చేపడుతున్నాయి.


అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఎన్నికల నోటిషికేషన్‌ తర్వాతే అధికారికంగా మిత్రపక్షాలతో సీట్ల కేటాయింపులకు సంబంధించి చర్చలు జరుపనున్నాయి. అదే సమయంలో అనధికారికంగా రహస్యంగా ఈరెండు పార్టీలు మిత్రపక్షాలతో సీట్ల కేటాయింపుల విషయంపై చర్చిస్తున్నాయి. అన్నాడీఎంకే కూటమిలో ఉన్న పీఎంకేకు మాత్రమే చెక్కుచెదరని వన్నియార్ల ఓటు బ్యాంకు ఉంది. పీఎంకే తర్వాత సినీనటుడు విజయకాంత్‌ నాయకత్వంలోని డీఎండీకే అధికంగా ఓటు బ్యాంకు కలిగిన పార్టీ. డీఎండీకే ప్రస్తుతం అన్నాడీఎంకే కూటమిలో కొనసాగాలా? లేక ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూటమిలో చేరాలా? ఒంటరి పోరుకు దిగాలో ఎటూ నిర్ణయం తీసుకోలేక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ కారణంగానే ముందుగా తమ కూటమి నుంచి పీఎంకే వైదొలగకుండా కాపాడుకోవాలని అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం భావిస్తున్నారు.


పీఎంకేను తమ కూటమిలోకి చేర్చుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో అన్ని పార్టీల కంటే ముందుగా పీఎంకేతో ఎన్నికల పొత్తును ఖరారు చేసుకోవాలని అన్నా డీఎంకే భావిస్తోంది. ఆ దిశగానే ప్రస్తుతం అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు పీఎంకే నేతలతో రహస్యంగా మంతనాలు చేస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకే అడిగినంత సీట్లను కేటాయించేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా వుంది. అయితే పీఎంకే నేతలు ఉన్నట్టుండి అధికారంలో భాగస్వామం కావాలని పట్టుబుడుతుండటంతో అన్నాడీఎంకే నేతలు దిగ్ర్భాంతి చెందుతున్నారు. మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చినప్పటికీ, తమకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌, ఆయన తనయుడు, ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అన్బుమణి రాందాస్‌ను  ఉప ముఖ్యమంత్రిగా చూడాలని డాక్టర్‌ రాందాస్‌ తహతహలాడుతున్నారు.


ఉత్తరాది జిల్లాల్లో తమ వన్నియార్ల ఓట్ల వల్లే అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుస్తున్నారని, తమ పార్టీ అండలేకుంటే అన్నా డీఎంకేకు మెజారిటీ రాదని డాక్టర్‌  రాందాస్‌ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు పీఎంకే నేతలను బుజ్జగించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని పీఎంకేకు కేటాయిస్తే కూటమిలోని డీఎండీకే, బీజేపీలు తీవ్ర నిరసన ప్రకటిస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే నాలుగైదు విడతలుగా అన్నాడీఎంకే, పీఎంకే నేతల మధ్య రహస్య మంతనాలు జరిగాయి. అయినా పీఎంకే తన పట్టు సడలించలేదని చెబుతున్నారు.  అన్నాడీఎంకే డిప్యూటీ సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు ఈ విషయాన్ని తెలిపి తగు నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నాడీఎంకే నేతలు రాందాస్‌కు తెలిపారు.  మంత్రి డి. జయకుమార్‌ మాట్లాడుతూ అన్నాడీఎంకే కూటమిలోనే పీఎంకే కొనసాగుతుందని ప్రకటించారు. సీట్ల కేటాయింపులపై ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత అధికారికంగా చర్చలు జరుగు తాయని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మిత్రపక్షాలు ఎక్కువగా సీట్లను కేటాయించాలని అడగటం, అధికారంలో భాగస్వామ్యం కోరటం సాధారణమైన విషయమని చెప్పారు. ఈ సమస్యలన్నీ స్నేహపూర్వకమైన చర్చలు ద్వారా పరిష్కారమవుతాయన్నారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం  మళ్ళీ ఆ పదవిని ఇవ్వటం ఖాయం. అలాంటప్పుడు పీఎంకేకు ఉప ముఖ్యమంత్రిని ఎలా కేటా యించగలమని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. ఎన్నికల నోటిషికేషన్‌ జారీ అయిన తర్వాత అన్నాడీఎంకే కూటమిలో ఈ సారి సీట్లకేటాయింపులపై చర్చలు వాడిగా వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2020-12-19T14:00:12+05:30 IST