తమిళనాట ఎన్నికలపై కమల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-11-06T17:35:28+05:30 IST

తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మక్కల్ నీదిమయ్యం వ్యవస్థాపకులు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్‌ నీదిమయ్యం ఘనవిజయం సాధిస్తుందని, శాసనసభలో తన స్వరాన్ని వినిపించబోతున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు...

తమిళనాట ఎన్నికలపై కమల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చెన్నై : తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మక్కల్ నీదిమయ్యం వ్యవస్థాపకులు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్‌ నీదిమయ్యం ఘనవిజయం సాధిస్తుందని, శాసనసభలో తన స్వరాన్ని వినిపించబోతున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. చెన్నై స్టార్‌హోటల్‌లో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూడు రోజులపాటు జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో సమావేశమయ్యాక తనలో ఉత్తేజం కలిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోగా తృతీయ కూటమిని ఏర్పాటు చేసే సత్తా తమ పార్టీకి మాత్రమే వుందని, ఎన్నికలకు ముందే తమ పార్టీ అన్నాడీఎంకే, డీఎంకే తర్వాత అతిపెద్ద మూడో పార్టీగా మారనుందని చెప్పారు. మక్కల్‌ నీది మయ్యం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాను పొత్తుపెట్టుకునేది లేదని, తమ పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను గౌరవించి ఇతర పార్టీలకు చెందిన నేతలు పలువురు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నానని తెలిపారు. సీఎం అభ్యర్థిగా తనను నిలబెట్టాలని పార్టీ శ్రేణులంతా భావిస్తున్నాయని, ఇక తాను ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలన్న విషయాన్ని నామినేషన్ల స్వీకరణ సమయంలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్‌ నీదిమయ్యం పార్టీ నాయకత్వంలో ఏర్పడబోయే కూటమి తృతీయ కూటమిగా కాకుండా అతి ముఖ్యమైన మెగా కూటమిగా నిలుస్తుందన్నారు. మక్కల్‌ నీదిమయ్యం పార్టీని బీజేపీకి మద్దతు ఇచ్చే ‘బీటీమ్‌’గా చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొడుతూ తమ పార్టీ బీ టీమ్‌ కాదని, ఏ టీమ్‌ అని చెప్పారు.


రజనీకి ఆరోగ్యమే ముఖ్యం...

తన చిరకాల మిత్రుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు రాజకీయప్రవేశం కంటే ఆరోగ్యమే చాలా ముఖ్యమని కమల్‌హాసన్‌ అన్నారు. రజనీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తాను కూడా కోరుకుంటున్నట్టు తెలిపారు. రజనీ రాజకీయ పార్టీని ప్రారంభించినా, పార్టీ పెట్టకపోయినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మద్దతు కోరతానని కమల్‌ ప్రకటించారు. పార్టీని ప్రారంభించాలో వద్దో నిర్ణయం తీసుకోవాల్సింది రజనీయేనని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు గురించి రజనీతో తాను తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నానని వెల్లడించారు. మనుధర్మంపై విమర్శలు చేయడం అనవసరమన్న ఆయన బీజేపీ తలపెట్టిన వెట్రివేల్‌ యాత్రకు అనుమతి నిరాకరించడాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని ఆయన చెప్పారు.

Updated Date - 2020-11-06T17:35:28+05:30 IST