తమిళనాడు అధికార కూటమిలో ‘సీఎం’ చిచ్చు
ABN , First Publish Date - 2020-12-20T08:49:23+05:30 IST
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలసి సాగుదామనుకుంటున్న బీజేపీ-అన్నాడీఎంకే పార్టీల మధ్య ‘సీఎం పదవి’పై చిచ్చు రగిలింది.

చెన్నై, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలసి సాగుదామనుకుంటున్న బీజేపీ-అన్నాడీఎంకే పార్టీల మధ్య ‘సీఎం పదవి’పై చిచ్చు రగిలింది. కూటమి సీఎం అభ్యర్థిని తామే నిర్ణయిస్తామని బీజేపీ అంటుండగా, అలాగైతే మీ దారి మీరు చూసుకోండని అన్నాడీఎంకే కౌంటర్ ఇచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలోనే సీఎం అభ్యర్థిగా సీఎం పళనిస్వామిని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శనివారం జరిగిన ఓ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్ మాట్లాడుతూ కూటమి సీఎం అభ్యర్థిని తమ పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటిస్తుందని, బీజేపీ జాతీయ కమిటీయే దానిని నిర్ణయించాల్సి ఉందని పేర్కొన్నారు. పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది అన్నాడీఎంకే మాత్రమేనన్నారు. ఈ వ్యాఖ్యలను మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్, మాజీ ఎంపీ అన్వర్ రాజా ఖండించారు. తమ కూటమిలో ఉంటూ, తమ నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. తమ పార్టీ నిర్ణయాన్ని ఆమోదించలేని వారు తమ దారి తాము చూసుకోవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు.