ఈసారైనా సీట్లు పెరిగేనా.. ఎండీఎంకేలో అంతర్మథనం?

ABN , First Publish Date - 2020-12-27T16:56:28+05:30 IST

డీఎంకే నుంచి ఉద్భవించిన ఎండీఎంకే.. ఇప్పటివరకూ ఆ పార్టీతో కలిసి

ఈసారైనా సీట్లు పెరిగేనా.. ఎండీఎంకేలో అంతర్మథనం?

చెన్నై : డీఎంకే  నుంచి ఉద్భవించిన ఎండీఎంకే.. ఇప్పటివరకూ ఆ పార్టీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నది లేదు. అయితే చరిత్రలో తొలిసారిగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలను డీఎంకేతో కలిసి ఎదుర్కోబోతోంది. దీంతో ఇప్పటివరకూ లేనన్ని అసెంబ్లీ స్థానాలు ఈసారి తమ పార్టీకి రావడం ఖాయమని ఎండీఎంకే భావిస్తోంది. డీఎంకేతో పొత్తు, అధికార పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకత కలిపి తమకు రెండంకెల స్థానాలను తెచ్చిపెడుతుందని గట్టిగా తలపోస్తోంది. అయితే తమ పార్టీ చిహ్నంపైనే పోటీ చేయాలని డీఎంకే చేస్తున్న చిన్న ‘వినతి’ ఎండీఎంకేలో ఆందోళన రేకెత్తిస్తోంది.


1993లో డీఎంకే నుంచి వైదొలిగిన వైగో, 1994లో మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే) పేరుతో పార్టీని స్థాపించారు. ఆ సమయంలో కరుణ వ్యవహార శైలిపట్ల అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు వైగో వెంట నిలిచారు. పార్టీ ప్రారంభించిన అనంతరం 1996 ఎన్నికల్లో జనతాదళ్‌, వామపక్షాలతో కలసి ఎండీఎంకే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి జయలలిత పట్ల ఉన్న అసంతృప్తి, డీఎంకే, మూపనార్‌ నేతృత్వంలోని టీఎంసీ సహా పలు పార్టీల కూటమికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మద్దతు ప్రకటించడంతో తదితరాల కారణంగా ఆ కూటమి భారీ విజయం సాధించింది. అయితే తొలిసారి ఎన్నికలను ఎదుర్కొన్న వైగో మాత్రం ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో విలాత్తికులం, శివకాశి నియోజకవర్గాల్లో పోటీచేసిన వైగో సైతం ఓటమి చెందారు. అనంతరం 1998లో అన్నాడీఎంకే కూటమిలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసిన ఎండీఎంకే మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఆ మరుసటి ఏడాదే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే కూటమితో కలిసి పోటీచేసిన ఎండీఎంకే.. నాలుగు స్థానాలను దక్కించుకుని.. వాజ్‌పేయ్‌ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంలో మంత్రి పదవిని సైతం పొందింది. అనంతరం 2001 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో సీట్ల సర్దుబాటుపై అలకబూనిన వైగో.. 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోరపరాజయం చవిచూశారు. ఆయన ఒంటరిగా పోటీ చేసి డీఎంకే ఓట్లను గణనీయంగా చీల్చారు. దీంతో అటు డీఎంకే, ఇటు ఎండీఎంకే బ్యాలెట్‌ బాక్సు ముందు బోర్లా పడాల్సి వచ్చింది.


తరువాత ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్‌కు మద్దతుగా మాట్లాడారన్న కారణంతో వైగో సహా ఎండీఎంకే సీనియర్‌ నేతల్ని జయలలిత పోటా చట్టం కింద అరెస్టు చేయించారు. రెండేళ్ల పాటు జైలుశిక్ష అనంతం విడుదలైన వైగో.. జీవితంలో తన పెద్దన్న కరుణ మాట జవదాటనని, జీవితాంతం ఆయన వెంటే నడుస్తానని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ తరువాత తన అరెస్టుకు కారణమైన జయను తీవ్రంగా విమర్శిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. అనంతరం 2004 పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఎండీఎంకే చేరింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వైగో విస్తృత ప్రచారం చేపట్టారు. ఆ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో ఎండీఎంకే విజయం సాధించింది. అయితే 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో మళ్లీ అలకబూనిని వైగో.. అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకున్నారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో 35 నియోజకవర్గాల్లో పోటీచేసిన ఎండీఎంకే.. 6 స్థానాల్లో విజయం సాధించి, తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది.


ఈలం తమిళుల సమస్య కారణంగా కేంద్రంలోని కాంగ్రెస్‌ కూటమి నుంచి వైదొలిగిన వైగో.. 2009 పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమితో నాలుగు స్థానాల్లో పోటీ చేసి ఈరోడ్‌ నియోజకవర్గం మాత్రమే దక్కించుకున్నారు. ఆ తరువాత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో అసంతృప్తి చెంది.. అన్నాడీఎంకే కూటమి నుంచి చివరి క్షణంలో వైదొలిగారు. అప్పటి వరకూ కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన.. చివరి క్షణంలో కూటమి నుంచి వైదొలిగి, ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. 2014 సంవత్సరంలో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం సృష్టించినా.. రాష్ట్రంలో మాత్రం బీజేపీ పప్పులుడకలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరిన వైగో.. 15 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఒక్క స్థానాన్ని సంపాదించుకోలేకపోయారు. విరుదునగర్‌ నియోజకవర్గంలో పోటీ చేసిన వైగో సైతం ఓటమి పాలయ్యారు. 


2016 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా సంక్షేమ కూటమి ఏర్పాటుకు వైగో తీవ్రంగా శ్రమించారు. డీఎండీకే, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, డీపీఐ సహా పలు పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి, అన్నాడీఎంకే, డీఎంకే కూటములకు ప్రత్యామ్నాయంగా ప్రజా సంక్షేమ కూటమి ఉంటుందని ప్రచారం చేసి ఎన్నికల బరిలో నిలిచారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సీఎం చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ప్రజాసంక్షేమ కూటమి ఒక్క స్థానాన్నీ దక్కించు కోలేకపోయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఎండీఎంకే, ప్రజా సంక్షేమ కూటమిలో ఉన్న సీపీఎం, సీపీఐ, డీపీఐలు కూటమి నుంచి వైదొలిగి డీఎంకేతో పొత్తు కుదుర్చుకున్నాయి. ఆ ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో డీఎంకే చిహ్నంతో పోటీ చేసిన ఎండీఎంకే అభ్యర్థి విజయం సాధించారు. సీట్ల కేటాయింపు చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం డీఎంకే కూటమి తరఫున వైగో రాజసభ్య సభ్యుడిగా ఎంపికయ్యారు.


ఇప్పుడేం జరగనుందో?

త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి డీఎంకే కూటమితో ఎండీఎంకే కలసి సాగనుంది. ఈసారి ఎలాగైనా రెండంకెల స్థానాలను దక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఆ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అంతేగాక తమ పార్టీకి బలమున్న తిరుపోరూర్‌, శంకరన్‌కోయిల్‌, వాసుదేవనల్లూర్‌, కినత్తుకడవు, శివగంగ, విరుదునగర్‌, కోవిల్‌పట్టి, విలాత్తికుళం, ఆలంగుడి, హార్బర్‌, థౌజండ్‌ లైట్స్‌ స్థానాలను దక్కించుకునేలా వైగో పావులు కదుపుతున్నారు. అయితే ఆ స్థానాలను డీఎంకే ఇస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై ఇప్పటికే ఆయన డీఎంకే నేతలతో చర్చించినట్టు సమాచారం. డీఎంకే అధినేత స్టాలిన్‌ను సీఎంగా చూడాలన్నదే తన ఆశయమని ఇప్పటికే వైగో ప్రకటించారు. 


కూటమి విజయానికి తాను తీవ్రంగా కృషి చేస్తానని కూడా స్పష్టం చేశారు. అందువల్ల ఎండీఎంకే అడిగినవన్నీ కాకపోయినప్పటికీ కొన్ని స్థానాలనైనా తమకు ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత పార్లమెంటు ఎన్నికల తరహాలోనే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ చిహ్నంపైనే ఎండీఎంకే అభ్యర్థులు పోటీ చేయాలని డీఎంకే అధిష్ఠానం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అదే జరిగితే తమ పార్టీ గుర్తింపు లేకుండా పోతుందని ఎండీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మొత్తమ్మీద ఈ వ్యవహారంపై త్వరలోనే స్పష్టత వస్తుందని, ఇరువురికి ఆమోదయోగ్యంగానే సీట్ల సర్దుబాటు జరుగుతుందని డీఎంకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


Updated Date - 2020-12-27T16:56:28+05:30 IST