హిందీలోనే ప్రసంగిస్తా.. ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండి :కేంద్ర కార్యదర్శి

ABN , First Publish Date - 2020-08-22T17:41:54+05:30 IST

కేంద్ర ఆయుశ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వెబినార్ శిక్షణా శిబిరం సాగింది. ఈ

హిందీలోనే ప్రసంగిస్తా.. ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండి :కేంద్ర కార్యదర్శి

న్యూఢిల్లీ : కేంద్ర ఆయుశ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వెబినార్ శిక్షణా శిబిరం సాగింది. ఈ వెబినార్‌కు దేశ వ్యాప్తంగా 350 మంది వైద్యులు హాజరయ్యారు. తమిళనాడు నుంచి 37 మంది వైద్యులు పాల్గొన్నారు. వీరందరూ ఈ శిక్షణ పొంది జిల్లాల్లోని ఆయుశ్ సెంటర్లలో కొత్తగా నియమితులైన వారికి శిక్షణనివ్వాల్సి ఉంటుంది. అయితే ఈ శిక్షణా కార్యక్రమం, ఉపన్యాసాలు మొత్తం కూడా హిందీలోనే జరిగాయి. చివరి రోజైన మూడో రోజు ఆయుశ్ విభాగానికి చెందిన కార్యదర్శి రాజేశ్ కొటేచా కీలక ఉపన్యాసం కూడా హిందీలోనే సాగింది.


దీంతో తమిళనాడుకు చెందిన వైద్యులకు హిందీ ఏమాత్రం అర్థం కావడం లేదు. తమకు హిందీ అర్థం కావడం లేదని, ఇంగ్లీషులో ప్రసంగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి రాజేశ్ కొటేచా స్పందిస్తూ... ‘‘నేను అనర్గళంగా ఆంగ్లంలో ఉపన్యసించలేను. కేవలం హిందీలోనే ఉపన్యసిస్తా. ఉంటే ఉండండి.. లేదంటే వెబినార్ నుంచి నిష్క్రమించండి’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.


ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘ఈ వెబినార్‌‌లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు. నేను ఇంగ్లీష్‌లో అంత చక్కగా ప్రసంగించలేను. హిందీలోనే ఉపన్యసిస్తా. ఇష్టం లేనివారు ఈ సమావేశం నుంచి నిష్క్రమించవచ్చు’’ అని రాజేశ్ కొటేచా వ్యాఖ్యానించారు.  

Updated Date - 2020-08-22T17:41:54+05:30 IST