చైనాపై కుతుకుతలాడుతున్న తైవాన్.. దేశం పేరు మార్చేదిశగా..

ABN , First Publish Date - 2020-04-01T22:32:39+05:30 IST

చైనా దాష్టికాన్ని వ్యతిరేకిస్తున్న తైవాన్ ప్రజలు

చైనాపై కుతుకుతలాడుతున్న తైవాన్.. దేశం పేరు మార్చేదిశగా..

తైపీ: తమది ప్రత్యేక దేశమని తైవాన్ ఎంత చెప్పుకున్నా ఇప్పటికీ అనేక మంది దాన్ని చైనాలో భాగంగానే చూస్తున్నారు. ప్రపంచం దృష్టిలో చైనాకు ఉన్న పరపతి, ప్రాబల్యం అట్లాండిది.  తైవాన్‌ చైనాలోని భూభాగమే కాబట్టి తామే దానికి ప్రానిథ్యం వహించాలనేది చైనా వాదన. ఈ విషయంలో తైవాన్ దేశ ప్రజల్లో ఎప్పటి నుంచీ అసంతృప్తి గూడు కట్టుకుంది.


ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి పడ్డ కరోనా సంక్షభంతో ఈ అంశం మరో సారి తెరపైకి వచ్చింది.  వాస్తవానికి తైవాన్‌లో కరోనా కేసులు చైనాలో ఉన్నంత స్థాయిలో ఏమీ లేవు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కరోనా లెక్కలు ప్రచురించినప్పుడు తైవాన్‌ను చైనాలో భాగంగా చూసింది. దీంతో చైనా యాత్రికులతో పాటూ తైవాన్ ప్రజలను అనేక దేశాలు దూరం పెట్టాయి. తమ దేశానికి రావద్దని గట్టిగా చెప్పాయి.


చైనా పక్కనే తైవాన్‌ ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం కరోనాను బాగానే కట్టడి చేసింది. కానీ ఆ కమ్యునిష్టు దేశం వైఖరితో తైవాన్ సాధించిన ఫలితాలకు గుర్తింపే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తైవాన్ అస్తిత్వం, స్వతంత్రత మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టాలంటే.. తైవాన్‌కు ఉన్న అధికారిక పేరులో మార్పులు చేయాలని తైవాన్ చట్టసభ సభ్యులు భావిస్తున్నారు. పేరులో చైనా ఆనవాళ్లు లేకుండా చేయాలని యోచిస్తున్నారు.


ప్రస్తుతం తైవాన్‌ను అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పిలుస్తున్నారు. ఇక చైనా అధికారిక నామం.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. దీంతో తైవాన్ అధికారిక పేరును రిపబ్లిక్ ఆఫ్ చుంగ్వా అని మారిస్తే.. తమ స్వతంత్రత చాటుకున్నట్లు అవుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు..అధికారిక పార్టీ సభ్యుడు లిన్ ఇ చిన్ కూడా ఇటీవల పేరు మార్పు ప్రతిపాదనను పార్లమెంటు సాక్షిగా ప్రస్తావించారు.


ఇక ప్రతిపక్ష పార్టీ నిర్వహించిన సర్వేలో ప్రజల్లో అధిక శాతం మంది తమ పాస్ పోర్టుల్లో చైనా ప్రస్తావన ఉండొద్దని భావిస్తున్నట్టు వెల్లడైంది. దీంతో తైవాన్‌లో పేరు మార్పు ప్రయత్నాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘చైనా కారణంగా తైవాన్‌ దుఖంలో మునిగింది’ అని చట్టసభల సభ్యుడొకరు వ్యాఖ్యానించారంటే అక్కడి ప్రజల మూడ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Updated Date - 2020-04-01T22:32:39+05:30 IST