బీజేపీలోకి స్వామిగౌడ్‌

ABN , First Publish Date - 2020-11-26T07:39:15+05:30 IST

టీఆర్‌ఎస్‌ నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌.. బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ కండువాను స్వామిగౌడ్‌కు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకర్లతో స్వామి గౌడ్‌ మాట్లాడారు. బీజేపీలో చేరడమంటే తిరిగి తన తల్లిగారింటికి వచ్చినట్లు భావిస్తున్నానని

బీజేపీలోకి స్వామిగౌడ్‌

ఉద్యమకారులను పక్కనబెట్టిన టీఆర్‌ఎస్‌

కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నడ్డా

తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టని వారికి పదవులు

రెండేళ్లుగా అపాయింట్‌మెంట్‌ కోరుతున్నా కేసీఆర్‌ ఇవ్వలేదు

మంచి నిర్ణయమని అంతా అభినందిస్తున్నారు: స్వామిగౌడ్‌


న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌.. బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ కండువాను స్వామిగౌడ్‌కు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకర్లతో స్వామి గౌడ్‌ మాట్లాడారు. బీజేపీలో చేరడమంటే తిరిగి తన తల్లిగారింటికి వచ్చినట్లు భావిస్తున్నానని తెలిపారు. ఆత్మాభిమానం కోసం తెలంగాణ ఉద్యమం చేశామని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక్కరోజూ ధర్నా చేయని, జెండా పట్టని, తెలంగాణ గురించి మాట్లాడని ఇతర పార్టీల పెద్దలకు ప్రధాన పదవులు ఇచ్చి.. ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ పార్టీ దూరంపెట్టడం బాధాకరమని చెప్పారు. కావాల్సిన మెజారిటీ ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చి ఏ వర్గానికి ప్రయోజనం చేకూర్చుతున్నారని టీఆర్‌ఎ్‌సను ఆయన ప్రశ్నించారు. తాను తండ్రిగా భావించిన సీఎం కేసీఆర్‌ ఇలా ఎందుకు వ్యవహరించారో ఎవరికీ అర్థంకాలేదని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో సీఎం కేసీఆర్‌ను కనీసం 100 సార్లు అపాయింట్‌మెంట్‌ అడిగానని, ప్రతీసారి రేపు కలుద్దామనే సమాచారం వచ్చేదని, రెండేళ్లలో ఆ రేపు ఎన్నడూ రాలేదని వాపోయారు.


వారం రోజుల క్రితం కూడా అపాయింట్‌మెంట్‌ అడిగానని వెల్లడించారు. తాను తొందరపడుతున్నానని  సీఎం కేసీఆర్‌ ఇతరులతో తనకు చెప్పించారని వెల్లడించారు. ఉద్యమంలో పనిచేసిన వారికి అవమానం జరుగుతున్నది వాస్తవమని, టీఆర్‌ఎ్‌సలోనూ అవమానపడుతున్నవారు చాలా మంది ఉన్నారని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ ఆమోదిస్తారని అనుకుంటున్నానని తెలిపారు. ఎలాంటి పదవుల కోసం బీజేపీలో చేరలేదని, గౌరవం కోసమే ఈ పార్టీలో చేరానని అన్నారు. మంచి నిర్ణయం తీసుకున్నానని చాలా మంది తనను అభినందించారన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఐదేళ్ల పరిపాలన వేరు, ఇప్పటి పరిపాలన వేరు కాబట్టి ప్రజలు అన్ని పరిణామాలు గమనిస్తున్నారని వివరించారు. 

Updated Date - 2020-11-26T07:39:15+05:30 IST