సువేందుతో టీఎంసీ నేతల భేటీ... బీజేపీలో చేరబోరంటూ..!
ABN , First Publish Date - 2020-12-02T05:20:06+05:30 IST
సువేందుతో టీఎంసీ ఎంపీ భేటీ... బీజేపీలో ఆయన చేరబోరంటూ..!
కోల్‌కతా: ఇటీవల పశ్చిమ బెంగాల్ మంత్రి పదవికి రాజీనామా చేసిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత సువేందు అధికారితో ఆ పార్టీ ఎంపీ సౌగతరాయ్ ఇవాళ సమావేశం అయ్యారు. సువేందు బీజేపీలో చేరబోవడం లేదంటూ ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించేందుకు ప్రయత్నం చేశారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో పాటు మరికొందరితో కలిసి సౌగతరాయ్ ఇవాళ సువేందుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘సువేందు అధికారి బీజేపీలోకి వెళ్లడంలేదు. అది ఓ తెలివితక్కువ ఊహాగానం. ప్రశాంత్ కిశోర్, సుదీప్ బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, సుదీప్ బెనర్జీలతో కలిసి సువేందుతో జరిపిన సమావేశం ఫలభరితంగా ముగిసింది. సమస్యలన్నీ చర్చించి పరిష్కరించుకున్నాం. ఆయన టీఎంసీలోనే ఉన్నారు. మేమంతా మమత గెలుపుకోసం కలిసి పనిచేస్తాం..’’ అని పేర్కొన్నారు. కాగా సువేందు తమ పార్టీలోకి వస్తే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇంతకు ముందు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కైలాశ్ విజయ్‌వర్గియా పేర్కొన్న విషయం తెలిసిందే.