‘రాజ్యాంగ విచ్ఛిన్నం’పై సుప్రీం స్టే

ABN , First Publish Date - 2020-12-19T07:05:18+05:30 IST

ఏపీలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేల్చుతామంటూ హైకోర్టు జరుపుతున్న విచారణను సుప్రీం కోర్టు నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులు

‘రాజ్యాంగ విచ్ఛిన్నం’పై సుప్రీం స్టే

సంబంధిత పిటిషన్లపైనా విచారణ నిలిపివేత


న్యూఢిల్లీ,డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేల్చుతామంటూ హైకోర్టు జరుపుతున్న విచారణను సుప్రీం కోర్టు నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులు తమను ఆందోళనకు గురి చేశాయని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో తదుపరి విచారణపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అక్రమ నిర్బంధం, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేల్చుతామని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టింది. ఈ విచారణ నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టి వేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీం కోర్టు సీజే జస్టిస్‌ బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ బోపన్న, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’తోపాటు దీనితో ముడిపడిన అన్ని పిటిషన్లపై విచారణను నిలిపివేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. దీనిపై శీతాకాల సెలవుల తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది.


‘వాయిదా’పై వాడివేడిగా!

‘కోర్టును దూషించాలనుకుంటే దూషించండి’... అంటూ ధర్మాసనం! ‘కోర్టు వైఖరి మరీ అన్యాయం’ అని ప్రభుత్వ తరఫు న్యాయవాది సీవీ మోహన్‌ రెడ్డి! ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’పై కేసులో శుక్రవారం ఇలా వాడివేడిగా వాగ్వాదం సాగింది. స్టే ఇవ్వకముందు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తాము దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనున్నందున ఇక్కడ విచారణను వాయిదా వేయాలని కోరారు. మధ్యాహ్నం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. సీవీ మోహన్‌ రెడ్డి కలుగజేసుకుని వ్యక్తిగత కారణాలతో మధ్యాహ్నం విచారణకు రాలేనని, సోమవారానికి వాయిదా వేయాలన్నారు. ధర్మాసనం నిరాకరించడంతో వాగ్వాదం సాగింది. మధ్యాహ్నం విచారణ ప్రారంభమయ్యాక... కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినట్లు ధర్మాసనం దృష్టికి రావడంతో.. ఆ తీర్పు వచ్చేవరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Updated Date - 2020-12-19T07:05:18+05:30 IST