జేఈఈ, నీట్‌కు సుప్రీం లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2020-08-18T07:16:33+05:30 IST

జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణపై కొంత కాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు సుప్రీంకోర్టు తెరదించింది. పరీక్షల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కరోనా ఉధృతి కారణంగా జేఈఈ(మెయిన్‌), నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను...

జేఈఈ, నీట్‌కు సుప్రీం లైన్‌ క్లియర్‌

  • వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత
  • విద్యా సంవత్సరాన్ని వృథా చేయలేం
  • విద్యార్థుల కెరీర్‌ను అనిశ్చితిలో ఉంచలేం
  • మరో ఏడాది వరకు కరోనా పోదు
  • అప్పటి వరకు వాయిదా వేయాలా?
  • జీవితం ముందుకు సాగాల్సిందే!
  • కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆగస్టు 17:  జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణపై కొంత కాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు సుప్రీంకోర్టు తెరదించింది. పరీక్షల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు  కరోనా ఉధృతి కారణంగా జేఈఈ(మెయిన్‌), నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది. పదకొండు రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు... సెప్టెంబరులో నిర్వహించనున్న జెఈఈ(మెయిన్‌), నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ అరుణ్‌మిశ్రా ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.


‘‘ కరోనా పేరుతో జీవితం ఆగిపోకూడదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. మరో ఏడాది దాకా కరోనా పోయే పరిస్థితులు లేవు. అప్పటి వరకు పరీక్షలను వాయిదా వేయాలంటే ఎలా? విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టలేం, విద్యా సంవత్సరాన్ని వృథా చేయడం ఇష్టం లేదు’’ అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను బెంచ్‌ కొట్టివేసింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తరపున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ పరీక్షల నిర్వహణకు అన్ని రకాల జాగ్రత చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సుప్రీంకోర్టు తీర్పుతో పరీక్షల నిర్వహణకు మార్గం సుగమం అయింది. జేఈఈ(మెయిన్‌)ని సెప్టెంబరు 1 నుంచి 6 వరకు, నీట్‌ను సెప్టెంబరు 13న నిర్వహించనున్నారు.


Updated Date - 2020-08-18T07:16:33+05:30 IST