‘ఆయుష్మాన్‌’ అమలుపై తెలంగాణకు సుప్రీం నోటీసులు

ABN , First Publish Date - 2020-09-12T07:59:22+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలుకు సంబంధించి తెలంగాణ, ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

‘ఆయుష్మాన్‌’ అమలుపై తెలంగాణకు సుప్రీం నోటీసులు

రెండు వారాల్లో జవాబివ్వాలి: బెంచి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలుకు సంబంధించి తెలంగాణ, ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వా లు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయ డం లేదంటూ బీజేపీ నేత పేరాల శేఖర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీజే బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపిం ది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది శ్రావణ్‌ కుమా ర్‌ వాదించారు. కరోనాసహా 1,500 రకాల వ్యాధులకు చికిత్సలు అందుబాటులో ఉన్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ఈ నాలుగు రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతోందని అన్నారు. ఈ రాష్ట్రాలు పథకాన్ని అమలు చేయకపోవడంలో కొవిడ్‌ పీడితులకు సరైన చికిత్స అందక పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్నా... అందులో కరోనాను చేర్చకపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రులు భారీగా ఫీజులు దండుకుంటున్నాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ లేదా ఆయుష్మాన్‌ భారత్‌లలో ఏదో ఒక పథకాన్ని ఎంచుకునే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలని ఆయన అన్నారు. 

Updated Date - 2020-09-12T07:59:22+05:30 IST